ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారు: సీఎం రేవంత్

ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారు: సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో జరుగుతోన్న శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలకు ఆదివారం (నవంబర్ 23) సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అరుదైన అవకాశమని అన్నారు. సత్యసాయి ప్రేమతో మనుషులను గెలిచారు.. సేవలతో దేవుడిగా కొలవబడుతున్నారన్నారు. 

సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వాలే తాగునీటి వసతులు ఏర్పాటు చేయలేని సందర్భంలో పాలమూరు, అనంతపురంలో బాబా ట్రస్ట్ ద్వారా దాహార్తి తీర్చారని ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడుకు కూడా సేవ అందించారని గుర్తు చేశారు. విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా జీవితంలో లక్ష్యసాధన కోసం ప్రజలకు ఒక స్థైర్యాన్ని ఇచ్చారన్నారు.