
- సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే షాక్
సింగపూర్: ఒలింపిక్స్ ముంగిట వరల్డ్ నంబర్ వన్ ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టికి షాక్ తగిలింది. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ఈ జంట తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశ పరిచింది. మంగళవారం జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ 20–22, 18–21తో డెన్మార్క్‌కు చెందిన 34వ ర్యాంకర్స్ డేనియల్ లుండ్‌గార్డ్– మడల్స్ వెస్టర్‌గాడ్ ద్వయం చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఇక, మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రియాన్షు రజావత్ 21–23, 19–21తో లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు.
విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆకర్శి కశ్యప్ 19–21, 20–22తో పొర్న్‌పిచా చొయికీవాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది. డబుల్స్‌లో రుతుపర్ణ–శ్వేతపర్ణ 12–21, 21–12, 13–21తో చాంగ్ చింగ్ హుయి–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) చేతిలో మూడు గేమ్స్ పాటు పోరాడి పరాజయం పాలవగా, మిక్స్‌డ్‌లో అషిత్ సూర్య–అమృత 8–21, 17–21తో లీచ్ చున్–ఎన్‌జి యయు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయారు.