
షెన్‌జెన్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్–750 టోర్నీలోనూ క్వార్టర్‌ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో 14–21, 13–21తో వరల్డ్ నంబర్‌వన్ అన్ సె యంగ్ (కొరియా) చేతిలో ఓడింది. సింధుకు ఇది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. యంగ్‌పై ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది.
38 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ ఏ దశలోనూ తన ట్రేడ్ మార్క్ ఆటను చూపెట్టలేకపోయింది. 1–6తో తొలి గేమ్ మొదలుపెట్టిన తెలుగు షట్లర్.. యంగ్ కొట్టిన డ్రాప్ షాట్స్ తీయలేక 5–9తో వెనకబడింది. ఈ క్రమంలో యంగ్ 11–5, 14–11తో దూసుకుపోయింది. రెండో గేమ్ ఆరంభంలో మెరుగ్గా ఆడిన సింధు 3–2తో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లినా యంగ్ వరుస పాయింట్లతో హోరెత్తించింది. ఫలితంగా 8–7తో లీడ్‌లో నిలిచింది. ఈ దశలో సింధు ఫ్రంట్ కోర్టులో కొన్ని డ్రాప్ షాట్లతో ఆకట్టుకున్నా.. కొరియన్ ప్లేయర్ వరుసగా 8 మ్యాచ్ పాయింట్లతో ఈజీగా గెలిచింది. మెన్స్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–14, 21–14తో రెన్ జియాంగ్ యు–జి హనోన్ (చైనా)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టారు.