సింగపూర్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ సింగపూర్ ఓపెన్ టైటిల్-2026 విజేతగా నిలిచింది. తద్వారా సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జోడీగా సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు.
సింగపూర్ వేదికగా ఆదివారం (మే 31) హోరాహోరీగా జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్-చిరాగ్ ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్-ముహమ్మద్ ఫిక్రీలను 18-21, 21-17, 21-16 తేడాతో ఓడించి టైటిల్ విజేతగా అవతరించింది. అత్యంత ఉత్కంఠభరింతగా సాగిన ఫైనల్ పోరులో ఇరు జట్ల ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు.
తొలి సెట్ (18-21) కోల్పోయిన భారత జోడి తమ సంయమనాన్ని కోల్పోకుండా తిరిగి బలంగా పుంజుకుంది. రెండో సెట్లో బలమైన స్మాష్లతో వరుసగా పాయింట్లు రాబట్టిన ఇండియన్ జోడీ కీలక టైమ్‌లో ఒత్తిడిని సమర్థవంతంగా జయించి రెండో సెట్‌ను దక్కించుకుంది. ఇరు జట్లు చెరో సెట్ గెలవడంతో గేమ్ మూడో సెట్‌కు దారి తీసింది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ సాత్విక్-చిరాగ్ అదరగొట్టింది.
►ALSO READ | ఐపీఎల్ ఫైనల్ ఫీవర్.. ఆర్సీబీ కప్పు గెలవాలని హోమాలు, ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్!
బలమైన స్మాష్‌లు, వ్యూహాత్మక నెట్ గేమింగ్‌తో 21-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి మూడో సెట్ గెలిచింది. తద్వారా సింగపూర్ ఓపెన్ టైటిల్-2026 విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ నిలిచి టైటిల్ కైవసం చేసింది. ఈ విజయంతో తమ రెండేళ్ల టైటిల్ ఆకలిని సాత్విక్-చిరాగ్ తీర్చుకుంది. భారత్‌కు తొలి సింగపూర్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ అందించిన సాత్విక్ చిరాగ్ జోడీకి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
