
హైదరాబాద్, వెలుగు: కొత్త పింఛన్ విధానం సీపీఎస్రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామన్న పార్టీలకే ఓటు వేయాలని నేషనల్ మూ
వ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. సోమవారం బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ గ్రౌండ్లో ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో కర్నాటక సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సత్యాగ్రహ సభ జరిగింది. కర్నాటక సీపీఎస్ యూనియన్ శాంతారం అధ్యక్షతన జరిగిన ఈ సభకు స్థితప్రజ్ఞ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో పాత పింఛన్ ఇచ్చే పార్టీకే ఓటు వేయాలని సీపీఎస్ ఉద్యమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు.
దీంతో ఆ రాష్ట్రంలో పాత పింఛన్ ఇస్తామన్న పార్టీకే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. కర్నాటకలోనూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, పాత పింఛన్ ఇచ్చే పార్టీలకే ఓటు వేయాలని తీర్మానించామని వెల్లడించారు. కర్నాటకలో నాలుగున్నర లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండగా, వారి కుటుంబాలకు చెందిన దాదాపు 30 లక్షల ఓట్లు రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాత పింఛన్ ఇచ్చే పార్టీకే ఓటేస్తామని సభకు వచ్చిన ఉద్యోగులు అందరితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీపీఎస్యూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ట్రెజరర్ నరేష్ గౌడ్, ఏపీ నేత రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.