- జన్వాడ భూముల అక్రమ బదలాయింపు అంటూ ఆరోపణలు!
- ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యాపారి అల్లాడి అభినవ్
- సాక్షిగా తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలంటూ ఇంప్లీడ్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: సత్యం కంప్యూటర్స్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితులైన రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు బినామీల పేర్లతో భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారని తార్నాకకు చెందిన అల్లాడి అభినవ్ అనే వ్యాపారి నాంపల్లిలోని ఈడీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని తన పేరున జీపీఏ ఉన్న భూములను అక్రమంగా బదలాయించుకున్నారని తన పిటిషన్‌లో అభినవ్ పేర్కొన్నారు.
తనను సాక్షిగా పరిగణించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని కోరుతూ.. గత నెల 29న ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. తాను అందించే సాక్ష్యాధారాలతో సంబంధిత ఆస్తులను అటాచ్‌మెంట్ చేయాలని కోరారు. అభినవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం కోర్టు పరిశీలించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
జన్వాడలో 97 ఎకరాల జీపీఏ వ్యవహారం
సత్యం కంప్యూటర్స్ కేసు 2009లో నమోదైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ దర్యాప్తు, విచారణ అనంతరం 2015 ఏప్రిల్‌లో సీబీఐ స్పెషల్ కోర్టు సత్యం రామలింగరాజు ఆయన కుటుంబ సభ్యులు నందిని రాజు, తేజారాజు సహా నిందితులకు ఏడేండ్ల శిక్ష విధించింది. సీబీఐ కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దాదాపు 160 కంపెనీలకు భూబదాలాయింపు జరిగినట్లు గుర్తించింది.
ఇందులో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలో గల దాదాపు 96 ఎకరాల భూమి మదన్‌గోపాల్, శ్యామ్‌లాల్‌కు చెందినదిగా పిటిషనర్ అల్లాడి అభినవ్ కోర్టుకు తెలిపారు.ఈ 96 ఎకరాల్లో కొంత తన పేరున జీపీఏ ఉన్నట్లు వెల్లడించారు. తన పేరున ఉన్న భూమి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ల ద్వారా 2014లో అక్రమ బదలాయింపులు చేసినట్లు వివరించారు.ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ అధికారులతో కలిసి దాదాపు రూ.5 వేల కోట్లు విలువ చేసే భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు అభినవ్ తన పిటిషన్‌లో వివరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు అందిస్తానని, సాక్షిగా తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని కోర్టును కోరారు.
