Toilet Footwear: అక్కడంతే.. మనం వాడే బాత్రూం చెప్పులు లక్ష రూపాయలా..!

Toilet Footwear: అక్కడంతే.. మనం వాడే బాత్రూం చెప్పులు లక్ష రూపాయలా..!

ఈ ఫొటోలో కనిపిస్తున్న పాదరక్షలు మీకు గుర్తుండే ఉంటయ్. గుర్తుండమేంటి వాడే ఉంటారు కూడా. ఈ చెప్పుల ధర ఎంత ఉంటుంది? ఒకప్పుడు 50, 60 రూపాయలు. ఇప్పుడు అన్నీ రేట్లు పెరిగాయనుకున్నా.. మహా అయితే వంద రూపాయలు. నీళ్లకు తడిసినా ఇబ్బంది ఉండదని టాయ్లెట్ చెప్పులుగా వీటిని ఎక్కువగా వాడుతుంటారు. పొలం పనులకు వెళ్లినప్పుడు సౌకర్యంగా ఉంటాయని, ముళ్ల నుంచి కాళ్లకు రక్షణగా ఉంటాయని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని ఎక్కువగా వాడుతుంటారు. 100 రూపాయలకు దొరికే ఈ సామాన్యుల చెప్పులను సౌదీ అరేబియాలోని కువైట్ లోని ఒక స్టోర్ లో లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు. ‘‘ఏంటి.. ఈ చెప్పులను లక్ష రూపాయలకు అమ్ముతున్నారా? మేం నమ్మం !’’ అని కొట్టిపారేయకండి. నమ్మి తీరాలి. నిజంగానే కువైట్ లోని ఒక స్టోర్ లో అద్దాల్లో పెట్టి మరీ లక్ష రూపాయలకు ఈ చెప్పులను ఒక లగ్జరీ ఐటంగా అమ్ముతున్నారు.

ALSO READ | జూన్‌‌‌‌లో పెరిగిన గూడ్స్ ఎగుమతులు

అక్కడి కరెన్సీలో చెప్పాలంటే ఈ చెప్పుల విలువ 4,500 రియాల్స్. మన కరెన్సీలో 1,03,126.01 రూపాయలు. టెక్నాలజీ, ఇంటర్నెట్ ఇంతగా అందుబాటులో ఉన్న ఈరోజుల్లో ఏ విషయం అయినా దాగుతుందా..? ఆ స్టోర్ లో ఉన్న చెప్పులను, ఆ చెప్పుల ధరను చూసి కువైట్ ఇన్ సైడ్ అనే ఇన్ స్టాగ్రాం పేజ్ లో పోస్ట్ చేశారు. ఒకరు ఆ చెప్పులు కొనడానికి వెళ్లినట్టుగా వెళ్లి ఎంత ఏంటని ఆరా తీస్తూ వీడియో తీశారు. అక్కడున్న సిబ్బంది ఆ చెప్పుల ఫీచర్స్ వివరించారు. ఆ పోస్ట్ చూసిన మనోళ్లంతా కామెంట్ సెక్షన్ లో హాస్యం పండించారు. మన ఇండియన్స్ టాయ్ లెట్ లో వాడే చెప్పులను కువైట్ లో లక్ష రూపాయలు అమ్ముతున్నారని ఇంటర్నెట్ లో వైరల్ చేసి టాంటాం చేశారు. కామెంట్స్ సెక్షన్ మొత్తం స్మైలీ ఎమోజీలతో నిండిపోయింది. ట్విటర్ లో కూడా ఈ టాపిక్ పై జోకులే జోకులు.

మన భారతీయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన దేశంలో ఈ చెప్పులను 100 రూపాయలకు కొని కువైట్ కు తీసుకెళ్లి లక్ష రూపాయలకు అమ్ముకోవాలని సలహాలిస్తున్న వాళ్లూ లేకపోలేదు. మరో కామెంటర్ స్పందిస్తూ.. కొన్నేళ్ల క్రితం తన అంకుల్ కు మ్యారేజ్ ప్రపోజల్స్ కు సంబంధించిన ఫొటోలు వచ్చాయని, ఒక యువతిని కేవలం ఆ చెప్పులు వేసుకుందనే ఒకేఒక్క కారణంతో ఫొటో చూసి రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చాడు.