పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత తగ్గించండి: దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు

పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత తగ్గించండి: దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు

గాంధీ నగర్: ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు చేపట్టాలని దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని, బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సాహించాలని, విదేశీ మారకద్రవ్యంతో కూడిన అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని పునరుద్ఘాటించారు. 

సోమవారం (మే 11) ప్రధాని మోడీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‎లో పర్యటించారు. ఈ సందర్భంగా వడోదరలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచ దేశాల్లో మొదలైన అస్థిరత పశ్చిమాసియాలోని తాజా సంఘర్షణలతో మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు చేపట్టాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘‘నా దేశ పౌరులందరూ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మెట్రో, ఎలక్ట్రిక్ బస్సులు, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించండి. కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించండి. కారు ఉన్నవారు ఒకే వాహనంలో ఎక్కువ మందిని తీసుకువెళ్లండి’’ అని పిలుపునిచ్చారు. అలాగే, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‎ను ప్రోత్సాహించాలని కంపెనీలకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్చువల్ సమావేశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్‎కు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరమని పేర్కొన్నారు. 

ఇంధన పొదుపుతో పాటు ప్రపంచ పరిస్థితులు స్థిరపడే వరకు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. భారతదేశం ప్రతి సంవత్సరం బంగారం దిగుమతులపై భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. దేశపు డబ్బులో అధిక భాగం బంగారం దిగుమతుల కోసం విదేశాలకు కూడా వెళ్తోంది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు బంగారం కొనుగోలును వాయిదా వేయాలని అందరినీ కోరుతున్నానని అన్నారు.

బంగారంతో పాటు ఇతర విదేశీ దిగుమతి ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన వస్తువులను ఎంచుకోవాలని కోరారు. స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

భారతదేశం విదేశాల నుంచి అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తుందని.. దీంతో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. అనవసరమైన విదేశీ ప్రయాణాలు, విదేశీ వివాహాలకు ఉండాలని సూచించారు. దేశ ప్రజలు విహారయాత్రలు, వివాహాల కోసం భారతదేశంలోని ప్రదేశాలను ఎంచుకోవాలని కోరారు.