కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి.. ఉద్యమానికి రెడీకండి

కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి.. ఉద్యమానికి రెడీకండి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను కేసీఆర్ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మలిదశ ఉద్యమానికి బీజేపీ కేడర్​ సిద్ధం కావాలని ఆ పార్టీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ పిలుపునిచ్చారు. దీనికోసం కేసులకైనా, లాఠీ దెబ్బలకైనా రెడీగా ఉండాలని, జైళ్లకు వెళ్లేందుకు కూడా భయపడొద్దని సూచించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం అందరూ పోరాడాలన్నారు. తెలంగాణను మరో పశ్చిమ బెంగాల్ లా కేసీఆర్ మారుస్తున్నారని, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. తనపై కూడా లాక్ డౌన్ ఉల్లంఘన కేసు పెట్టారని సంజయ్ చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల, మంత్రుల అవినీతి బాగోతాలను బయటపెడుతామని, సీఎం కేసీఆర్ కు చివరి మజిలీ ఇక జైలేనని హెచ్చరించారు. తెలంగాణ తల్లిని మజ్లిస్ కబంధ హస్తాల్లో తాకట్టు పెట్టారని విమర్శించారు. మజ్లిస్​ గూండాలు దళిత బాలికను అత్యాచారం చేసినా, మరో దళిత మహిళా ప్రజాప్రతినిధిపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేసినా ఈ ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎం తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన ‘జన సంవాద్​’ సభలో బండి సంజయ్​ మాట్లాడారు. గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ స్వయంగా హాస్పిటల్​కు వెళ్లి కరోనా పరిస్థితిని తెలుసుకున్నారని, కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్, ప్రగతి భవన్ దాటి బయటకు రావడంలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతగాని తనం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని ఆరోపించారు. సీఎం అసమర్థతతో కరోనా వారియర్స్ డాక్టర్లు, హెల్త్​ స్టాఫ్​, పోలీసులు, జర్నలిస్టులు మరణిస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యంతో కేసీఆర్ ఆటలాడుకుంటున్నారని దుయ్యబట్టారు. వారికి ఫ్రీ ట్రీట్​మెంట్​ అందించాల్సిన సీఎం.. కార్పొరేట్​ హాస్పిటల్స్ కు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.

కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనా ట్రీట్​మెంట్​ను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని లేదంటే తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. కరోనాపై కేసీఆర్, ఆయన మంత్రులు మాట్లాడిన మాటలు చూస్తుంటే వీరిని జనం జోకర్లుగా చూసి నవ్వుకుంటున్నారన్నారు. డీపీఆర్ అంటే దోపిడీకి ప్రాజెక్టు రిపోర్టుగా కేసీఆర్ భావిస్తూ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొండపోచమ్మ ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి నీరు పారలేదని, కేసీఆర్ పర్యటనతో పలువురికి కరోనా మాత్రం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటే, కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఆరుగురికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని, గతేడాది మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల 26 మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. షరతుల పంటలని చెప్పి చివరకు రైతులను కూడా సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. ఉద్యోగ, టీచర్ల, పెన్షనర్ల జీతాల్లో కోతలు పెట్టి వారిని సీఎం వేధిస్తున్నారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో మనదే పవర్​: కిషన్ రెడ్డి

తెలంగాణను కేసీఆర్​, ఒవైసీ ఫ్యామిలీల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని బీజేపీ కేడర్​కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ రెండు కుటుంబాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని, వారి నిర్వాకం వల్ల తెలంగాణ అమరవీరుల ఆశయం నెరవేరడం లేదని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన బిడ్డల ఆశయాలను నెరవేర్చే బాధ్యతను బీజేపీ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా బీజేపీ నిలదొక్కుకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్నారు. ఢిల్లీ నుంచి పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో కలిసి కిషన్ రెడ్డి డిజిటల్ వేదికగా ‘జన్ సంవాద్’ సభలో పాల్గొని తెలంగాణ పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా విషయంలో సౌత్​ ఇండియాలోనే హైదరాబాద్ అత్యంత ప్రమాదకరంగా మారిందని, వైరస్‌‌ కట్టడిలో సీఎం కేసీఆర్ చూపిన నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. మర్కజ్​తో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని చెపితే మొదట కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు. కేవలం మజ్లిస్ ఒత్తిడితోనే రాష్ట్రంలో కేసీఆర్​ సర్కార్​ కరోనా టెస్టులు చేయలేదని విమర్శించారు.

బీజేపీ కేడర్​లో జోష్

జన సంవాద్​ సభలో ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని పార్టీ స్టేట్ ఆఫీసు నుంచి స్టేట్ చీఫ్​ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, పార్టీ స్టేట్​ మాజీ చీఫ్​ లక్ష్మణ్, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. డిజిటల్ వేదికగా ఢిల్లీ, హైదరాబాద్ ల నుంచి నిర్వహించిన ఈ వర్చువల్ ర్యాలీని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కో ఆర్డినేట్ చేశారు. జేపీ నడ్డా ప్రసంగాన్ని మురళీధర్ రావు తెలుగులోకి ట్రాన్స్​లేట్ చేశారు. పార్టీకి చెందిన ఫేస్ బుక్, యూ ట్యూబ్​, ఇతర సోషల్ మీడియా ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జన సంవాద్‌‌లో పాల్గొన్నారు. నేతల ప్రసంగాలను వారు ఆసక్తిగా విన్నారు. వారిలో కొత్త ఉత్సాహం కనిపించింది. సభ ప్రారంభానికి ముందు సంజయ్, పార్టీ నేతలు వేదికపై ఉన్న భారతమాత, పార్టీ సిద్ధాంతకర్తలు దీన్ దయాళ్, శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్ర పటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు, ఇతర జవాన్ల ఫొటోలకు పూలమాలలు వేసి, 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి