ఘనంగా సావిత్రి మహోత్సవ్ వేడుకలు

ఘనంగా సావిత్రి మహోత్సవ్ వేడుకలు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌‌లోని రవీంద్రభారతిలో వైభవంగా జరిగాయి. సంగమం  ఫౌండేషన్‌‌తో కలిసి  డిసెంబర్ 1 నుంచి 6 వరకు ‘సావిత్రి మహోత్సవ్' పేరిట సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు.  

తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని,  సావిత్రి కనిపించేది కాదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌‌ మాట్లాడుతూ-.. సినీ రంగానికి సావిత్రి అభినయ నట శాస్త్ర గ్రంథమని,  సినీ రంగంలో ఎంతమంది కథానాయికలున్నా మహానటి మాత్రం సావిత్రిగారే అని అన్నారు.

  ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్‌‌, స్వప్న దత్‌‌, రచయిత సంజయ్‌‌కిషోర్‌‌, ప్రచురణ కర్త బొల్లినేని కృష్ణయ్యలను ఘనంగా సత్కరించారు.  నటులు, నిర్మాత మురళీమోహన్‌‌, తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి, తదితరులు పాల్గొన్నారు.