
Sawaliya Foods IPO: ఈక్విటీ మార్కెట్ల పనితీరుతో సంబంధం లేకుండా ఐపీవోలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. మార్కెట్లు లాభాల్లో ఉన్నా లేక డల్ గా ఉన్నా ఐపీవోలకు క్రేజ్ తగ్గకపోవటానికి కారణం లాభాల లిస్టింగ్స్ అని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సవాలియా ఫుడ్స్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో నేడు ఎన్ఎస్ఈలో ఒక్కో స్టాక్ 90 శాతం ప్రీమియం ధర రూ.228 వద్ద లిస్ట్ అయ్యింది. అయితే లిస్టింగ్ తర్వాత కొనుగోలుదారుల నుంచి కొనసాగిన డిమాండ్ కారణంగా స్టాక్ 100 శాతం లాభం అందించింది పెట్టుబడిదారులకు. దీంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు గరిష్ఠంగా ఒక్కోటి రూ.239.40 స్థాయికి చేరుకుంది. ప్రధానంగా ఐపీవోకు నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి అధిక డిమాండ్ కనిపించింది.
Also Read:-మొదటిసారిగా ఐపీఓకు ఏఐ కంపెనీ... రూ. 4 వేల 900 కోట్లు సేకరించనున్న ఫ్రాక్టల్ అనలిటిక్స్
సవాలియా కంపెనీ తన ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.34కోట్ల 83లక్షలు విజయవంతంగా సమీకరించింది. ఐపీవో తన బిడ్డింగ్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆగస్టు 7 నుంచి ఆగస్టు 11 వరకు అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో స్టాక్ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.120గా ఉంచింది. పైగా లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. ఐపీవో సమయంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.9కోట్ల 84లక్షలు సమీకరించగలిగింది.
కంపెనీ వ్యాపారం..
సవాలియా కంపెనీ ప్రధానంగా డీహైడ్రేటెడ్ కూరగాయల తయారీ వ్యాపారంలో ఉంది. కంపెనీ నేరుగా వ్యాపార సంస్థలతో బి2బి మోడల్ కింద పనిచేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పనితీరు వ్యాపారం ఒక్కసారిగా పెరగటం ఇన్వెస్టర్లను కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ ఐపీవో విషయంలో కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్లటం మంచిదని నిపుణులు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.