
ఆంధ్రప్రదేశ్ విజయవాడ కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ ఆయన ఫొటో తో ఆస్పత్రి మెట్లపై కూర్చుని వేడుకుంటోంది ఆయన భార్య ధనలక్మి.
తన భర్త కు ఆయాసం రావడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లామని తెలిపారు వసంతరావు భార్య ధనలక్ష్మి. అయితే కరోనా లక్షణాలు ఉన్నాయని.. ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారన్నారు. ఈనెల 24వ తేదీన ఆస్పత్రికి వెళ్లగా… చాలా సమయం వరకు సిబ్బంది స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అందరనీ అడిగాక.. వీల్ చైర్ ద్వారా లోపలకు పంపారని తెలిపారు. ఆ తర్వాత టెస్టులు చేసిన డాక్టర్లు పల్స్ పడిపోతున్నాయని.. ఆక్సిజన్ పెట్టాలని చెప్పారన్నారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు అక్కడే ఉన్న తనను ఆస్పత్రి సిబ్బంది ఇంటికి పంపేశారని…25వ తేదీన ఆస్పత్రికి వెళితే తన భర్త కనిపించడం లేదని చెప్పారు.
ఆస్పత్రి సిబ్బందిని అడిగితే అతడు పారిపోయాడని చెబుతున్నారని తెలిపారు ధనలక్ష్మి. వీల్ చైర్ కే పరిమితమై నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా పారిపోయాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి దగ్గర నిరసనకు దిగారు. వారం రోజుల క్రితం నుంచి ఆయన ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బంధువులు హాస్పటల్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారం అయినా ఆచూకీ దొరకలేదని… అధికారులు వెతుకుతున్నామని చెబుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి వసంతరావును తమకు అప్పగించాలని ఆయన బందువులు విజ్ఞప్తి చేస్తున్నారు.