శాయంపేట వడ్ల స్కామ్‌‌లో మరో 13 మంది అరెస్ట్

శాయంపేట వడ్ల స్కామ్‌‌లో మరో 13 మంది అరెస్ట్
  • ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌‌తో పాటు కుటుంబసభ్యులు...
  •  బంధువులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గతంలోనే ఏడుగురు అరెస్ట్‌‌, పరారీలో మరో ఇద్దరు నిందితులు

హనుమకొండ, వెలుగు : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో పోడు భూముల్లో వరి సాగు చేసినట్లు రికార్డులు సృష్టించి వడ్ల స్కామ్‌‌కు పాల్పడిన బెజ్జంకి శ్రీనివాస్‌‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువులైన 13 మందిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. 

నిందితుల నుంచి ఓ కారు, భూములకు సంబంధించిన పత్రాలను సీజ్‌‌ చేశారు. ఈ కేసులో 22 మంది నిందితులుగా తేలగా.. గతంలోనే ఏడుగురిని అరెస్ట్‌‌ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌ ఈస్ట్‌‌ జోన్‌‌ డీసీపీ అంకిత్‌‌కుమార్‌‌ మంగళవారం వెల్లడించారు. 

మొత్తం రూ. 2.10 కోట్ల స్కామ్‌‌

హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌ మండల కేంద్రంలోని సాంబశివ మినీ మోడ్రన్‌‌ రైస్‌‌ మిల్‌‌ యజమాని బెజ్జంకి శ్రీనివాస్‌‌ గత రబీ సీజన్‌‌లో బండ లలిత అనే మీడియేటర్‌‌ ద్వారా శాయంపేట మండలంలోని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సాయంతో వడ్ల కొనుగోలు స్కామ్‌‌కు తెరలేపాడు. ఇందులో భాగంగా తన భార్య బెజ్జంకి శోభారాణి, కొడుకులు పున్నం చారి, శివకుమార్, చందు, ఇద్దరు కోడళ్లు నవత, శ్రీనవ్య, మరో నలుగురు బంధువులు వడ్లూరి కల్యాణ్, వేమునూరి శ్రీనివాసాచారి, వేమునూరి ఉదయలక్ష్మి, చిరంచ సింధు అనే 12 మంది శాయంపేట మండలంలోని 278 ఎకరాల పోడు భూమిని సాగు చేయగా.. 8,049 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయించారు.

 ఇందుకు ఓపీఎంఎస్‌‌ ఆపరేటర్‌‌ చరణ్‌‌సింగ్‌‌, మీడియేటర్‌‌ లలితకు క్వింటాకు రూ.120 చొప్పున కమీషన్‌‌ ఇచ్చేలా ప్లాన్‌‌ చేశాడు. అనంతరం ఏఈవోలు సుప్రియ, అర్చన టోకెన్స్‌‌ ఇవ్వగా... ఏవో లాగిన్‌‌లో ఎంట్రీ చేశారు. దీంతో బెజ్జంకి శ్రీనివాస్‌‌ కుటుంబ సభ్యుల ఖాతాలో రూ.1.86 కోట్లు జమయ్యాయి. వీరితో పాటు బండ లలిత, ఆమె భర్త బండ రజినీకర్, ఆపరేటర్‌‌ చరణ్‌‌ సింగ్‌‌ సైతం 36 ఎకరాల్లో 1,051 క్వింటాళ్లు పండించినట్లు రికార్డులు సృష్టించగా.. వారి ఖాతాల్లోనూ రూ.24 లక్షలు పడ్డాయి. 

మొత్తం 314 ఎకరాల్లో 9,100 క్వింటాళ్ల వడ్లు పండించినట్లు రికార్డులు సృష్టించడంతో మొత్తం 15 మంది ఖాతాల్లో రూ.2.10 కోట్లు జమయ్యాయి. ఇందులోంచి కమీషన్‌‌ పేరుతో మీడియేటర్‌‌ లలిత, ఆపరేటర్‌‌ చరణ్‌‌సింగ్‌‌ రూ. 10.92 లక్షలు, బోనస్‌‌ కింద బెజ్జంకి శ్రీనివాస్‌‌ రూ. 45 లక్షలు, మిల్లింగ్‌‌ చార్జి కింద రూ. 4.5 లక్షలు పోగా.. మిగతా 1.32 కోట్లను శ్రీనివాస్‌‌ కుటుంబ సభ్యులు డ్రా చేశారు. ఈ డబ్బులతో భూమి, కారు కొనుగోలు చేయగా.. మిగిలిన డబ్బులను గత సీజన్‌‌ ధాన్యం షార్టేజీని భర్తీ చేయడానికి ఖర్చు చేశాడు. 

కాగా, ఇటీవల సివిల్‌‌ సప్లై, విజిలెన్స్‌‌ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో 22 మందిపై కేసు నమోదు చేసిన విజిలెన్స్‌‌ ఆఫీసర్లు బండ లలిత, చరణ్ సింగ్, ఐకేపీ నిర్వాహకులు బలభద్ర హైమావతి, అల్లె అనిత, బెజ్జంకి శ్రీనివాస్‌‌ బంధువు వడ్లూరి రాజేందర్, లారీ కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్‌‌రావు, శాయంపేట ఏఈవో అర్చనను గత నెలలో అరెస్ట్‌‌ చేశారు.

 తాజాగా ప్రధాన నిందితుడు బెజ్జంకి శ్రీనివాస్, అతడి భార్య శోభారాణి, కొడుకులు పున్నంచారి, శివకుమార్, చందు, కోడళ్లు నవత, శ్రీనవ్య, బంధువులు వడ్లూరి కల్యాణ్, వేమునూరి శ్రీనివాసాచారి, వేమునూరి ఉదయలక్ష్మి, చిరంచ సింధుతో పాటు కాట్రపల్లి ఏఈవో ఎం.సుప్రియ, లలిత భర్త బండ రజినీకర్‌‌రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుల అకౌంట్లలో ఉన్న రూ.54 లక్షలను సీజ్‌‌ చేయడంతో పాటు శ్రీనివాస్‌‌ కొనుగోలు చేసిన కారు, భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శాయంపేట ఏవో గంగా జమున, బెజ్జంకి శ్రీనివాస్ బంధువు వడ్లూరి శ్రీచరణ్ పరారీలో ఉన్నారని డీసీపీ అంకిత్‌‌కుమార్‌‌ తెలిపారు.