ఆర్టీఐ కింద ఎలక్టోరల్​బాండ్ల వివరాలు ఇవ్వలేం : ఎస్​బీఐ

ఆర్టీఐ కింద ఎలక్టోరల్​బాండ్ల వివరాలు ఇవ్వలేం : ఎస్​బీఐ

న్యూఢిల్లీ: ఎలక్టోరల్​ బాండ్లకు సంబంధించిఎన్నికల కమిషన్​కు ఇచ్చిన వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చేందుకు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ చట్టబద్ధం కాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే. బాండ్ల వివరాలను ఈసీకి ఇవ్వాలని, వాటిని వెబ్​సైట్​లో ఉంచాలంటూ పేర్కొంది. దీంతో ఎస్​బీఐ సమర్పించిన వివరాలను ఈసీ మార్చి 14న తన వెబ్​సైట్​లో ఉంచింది. ఆర్టీఐ కార్యకర్త లోకేశ్ బాత్రా ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలు కావాలంటూ మార్చి 13న ఎస్​బీఐకి ఆర్టీఐ చట్టం కింద అప్లికేషన్ పెట్టుకున్నారు. 

దాన్ని ఎస్​బీఐ తిరస్కరించింది. సమాచారహక్కు చట్టంలోని రెండు క్లాజులను ప్రస్తావిస్తూ.. విశ్వసనీయ సమాచారం, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా వాటిని ఇవ్వలేమంటూ దరఖాస్తును తిరస్కరించింది. ఎస్ బీఐ తరఫున సుప్రీంకోర్టులో బాండ్ల కేసును వాదించిన లాయర్​ హరీశ్ సాల్వేకు చెల్లించిన ఫీజు వివరాలు ఇవ్వాలని బాత్రా దరఖాస్తులో కోరారు. ఆ వివరాలను కూడా ఎస్​బీఐ ఇవ్వలేదు. ఈసీ వెబ్​సైట్ లో ఉన్న వివరాలు ఇచ్చేందుకు ఇబ్బంది ఏముందని బాత్రా ప్రశ్నించారు.