‘ఎస్బీఐటీ’కి ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అవార్డు

‘ఎస్బీఐటీ’కి ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అవార్డు

ఖమ్మం టౌన్,వెలుగు : ఐటీసీఅకాడమీ ప్రతిఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్రిడ్జ్ కార్యక్రమంలో 2025వ సంవత్సరానికి గాను స్థానిక ఎస్ బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అవార్డు అందుకుందని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన బ్రిడ్జ్ 2025 కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ నుంచి అవార్డు అందుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడు కళాశాలలను మాత్రమే ఎంపిక చేయగా, తమ కళాశాల మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.

 ఉన్నత విద్యా ప్రమాణాలలో విప్లవాత్మక మార్పులకు గాను ఈ అవార్డుకు కళాశాల ఎంపికైనట్లు వివరించారు. డిజిటల్ విద్యను అందించడం, దిగ్గజ కంపెనీలతో అవగాహన కుదుర్చుకోవడం, ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేయడం, రీసెర్చ్ కు పెద్ద పీట వేయడం ద్వారా తమ కళాశాల రాష్ట్ర స్థాయిలో గుర్తింపును సాధించిందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి తెలిపారు.

 ఐసీటీ అకాడమీ సహకారంతో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక రంగాలలో శిక్షణను ఇప్పించడంలో, లెక్చరర్లకు ఫ్యాకల్టీ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు సాధించడం ద్వారా కళాశాల ఈ అవార్డును అందుకున్నదని కళాశాల వైస్ చైర్మన్ శ్రీ చైతన్య అభిప్రాయపడ్డారు. గతేడాది ప్రతిష్టాత్మక అటానమస్, న్యాక్ ఏ+ హోదా కళాశాలకు వచ్చాయని ఈ సంవత్సరం ఐబీఎం అవార్డుతో పాటు ఐసీటీ అవార్డు దక్కించుకోవడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ తెలిపారు.

 తమ కళాశాలకు ఈ గుర్తింపును అందించడానికి సహకరించిన ఐటీసీ అకాడమీ స్టేట్ హెడ్ బి. గోపాల్, రిలేషన్ షిప్ మేనేజర్ షేక్ గౌస్ పాషాకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డాక్టర్ ఏవీవీ శివ ప్రసాద్, డాక్టర్ జె. రవీంద్రబాబు, టీపీఓఎన్ సవిత, కోఆర్డినేటర్ డాక్టర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.