బీసీ కోటాపై హైకోర్టులోనే తేల్చుకోండి..సుప్రీంకోర్టు

బీసీ కోటాపై హైకోర్టులోనే  తేల్చుకోండి..సుప్రీంకోర్టు
  • పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చు
  • రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌కు సుప్రీంకోర్టు సూచన 
  • స్పెషల్ లీవ్ పిటిషన్‌‌‌‌పై విచారణకు నిరాకరణ 
  • మెరిట్స్ ప్రకారమే విచారించాలని హైకోర్టుకు నిర్దేశం

న్యూఢిల్లీ, వెలుగు: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తెలిపింది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని, మెరిట్స్ ప్రకారమే ముందుకెళ్లాలని హైకోర్టుకు సూచించింది. 

ఒకవేళ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 తీసుకొచ్చింది. అయితే దాన్ని మాధవరెడ్డి, మరొకరు హైకోర్టులో సవాల్ చేయడంతో కోర్టు ఈ నెల 9న స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. 

దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ, ప్రతివాదుల తరఫున సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకర్ నారాయణ్, కె.వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి హాజరయ్యారు. తొలుత సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. 

‘‘శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించి, డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సాహ్నీ కేసులో తొమ్మిది మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పకడ్బందీ సర్వే నిర్వహించి, బీసీ బిల్లు తీసుకొచ్చింది. దానికి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపాయి. కానీ గవర్నర్ పెండింగ్‌‌‌‌లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ప్రతివాదులు బిల్లును చాలెంజ్ చేయకుండా, బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు” అని పేర్కొన్నారు.  

చట్ట ప్రకారమే రిజర్వేషన్లు పెంపు: సింఘ్వీ 

దేశంలోనే తొలిసారి శాస్త్రీయంగా బీసీల లెక్కలు తీసీ, తద్వారా రిజర్లేషన్ల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లిందని సింఘ్వీ వాదించారు. ‘‘ప్రభుత్వం డెడికేట్ కమిషన్ ద్వారా సర్వే జరిపింది.  బీసీ జనాభా డేటా ఆధారంగానే రిజర్వేషన్లు పెంచింది. ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించాం. సమగ్రంగా, సాంకేతికంగా సర్వే జరిపాం. 

అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపై స్టే ఎలా విధిస్తారు? హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఎలాంటి సహేతుక కారణాలు వెల్లడించలేదు. ఎంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చునని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది’’ అని గుర్తు చేశారు. 

అయితే అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని చెప్పారు. ‘‘ఇది ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం కదా? 119 మంది ఎమ్మెల్యేలు కలిసి ఏకగ్రీవంగా చేసిన నిర్ణయాన్ని పెండింగ్‌‌‌‌లో పెడితే ఎలా?’’ అని సింఘ్వీ వాదించారు. ఈ టైమ్‌‌‌‌లో కోర్టు జోక్యం చేసుకొని... ‘రిజర్వేషన్ల జీవో ఇచ్చే ముందు బిల్లుకు నోటిఫికేషన్ ఇచ్చారా?’ అని ప్రశ్నించింది. 

ఇందుకు సింఘ్వీ బదులిస్తూ..గవర్నర్ బిల్లులను ఆమోదించనప్పుడు గవాయ్ కేసులో గైడ్‌‌‌‌లైన్స్ ఫాలో అయి జీవో 9 జారీ చేసినట్లు చెప్పారు. ఈ విషయంలో శాస్త్రీయంగానే ముందుకెళ్లినట్లు తెలిపారు. మరోసారి స్పందించిన కోర్టు.. ‘రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో 9 ఇచ్చారు. అదే రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ హడావుడిగా ఇవ్వడానికి కారణమేంటి?” అని ప్రశ్నించింది. 

సింఘ్వీ బదులిస్తూ.. చట్ట సభలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ చట్టాన్ని ఎవరూ సవాల్ 
చేయలేరన్నారు. 

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు: శంకర్ నారాయణ్ 

ప్రతివాది తరఫున గోపాల్ శంకర్ నారాయణ్ వాదిస్తూ.. ప్రభుత్వం చేపట్టిన సర్వే, కేబినెట్ నిర్ణయాలను తప్పుబట్టడం లేదన్నారు. కేవలం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు పెంచడాన్ని సవాల్ చేస్తున్నామని చెప్పారు. 

‘‘ఎన్నికలను సవాల్ చేయడం లేదు. పెంచిన బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 67 శాతానికి పెరుగుతున్న రిజర్వేషన్లను సవాల్ చేస్తున్నాం’’  అని తెలిపారు. మధ్యలో కోర్టు జోక్యం చేసుకొని.. ‘రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటే ఎస్సీ, ఎస్టీలకు తగ్గించాల్సి వస్తుంది కదా?’ అని ప్రశ్నించింది. దానికి అడ్వొకేట్ అవునని సమాధానం ఇచ్చా రు. 

రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌‌‌లోనూ రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. 50 శాతానికి మించకుండా ఎన్నిలకు వెళ్లాలని సూచించిందని పేర్కొన్నారు. ట్రిపుల్ టెస్టులో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండవని వాదించారు. 

అలాగే పంచాయితీ రాజ్ చట్ట సవరణపై ప్రభుత్వం తెచ్చి న ఆర్డినెన్స్ సైతం చెల్లదన్నారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. ప్రభుత్వ పిటిషన్‌‌‌‌ను డిస్మిస్ చేస్తున్న ట్టు తెలిపింది. అయితే, సింఘ్వీ జోక్యం చేసుకొని.. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉందని చెప్పారు. అయితే ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవాలని, హైకోర్టు మెరిట్స్‌‌‌‌లోకి వెళ్లాలని సూచించింది. ప్రభు త్వం ఎన్నికలు నిర్వహించాలనుకుంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకెళ్లొచ్చని స్పష్టం చేసింది.

ప్రభుత్వం డెడికేట్ కమిషన్ ద్వారా సర్వే జరిపింది.  బీసీ జనాభా డేటా ఆధారంగానే రిజర్వేషన్లు పెంచింది. ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించాం. సమగ్రంగా, సాంకేతికంగా సర్వే జరిపాం. అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపై స్టే ఎలా విధిస్తారు? హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఎలాంటి సహేతుక కారణాలు వెల్లడించలేదు. 

ఎంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చునని గవాలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ