వక్ఫ్ బోర్డులో మెజార్టీ సభ్యులు ముస్లింలే ఉండాలి

వక్ఫ్ బోర్డులో మెజార్టీ సభ్యులు ముస్లింలే ఉండాలి
  • సవరణ చట్టంలోని పలు కీలక ప్రొవిజన్లపై సుప్రీం స్టే
  • వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్​ నిలిపివేత 
  • ఆస్తిని వక్ఫ్​ చేసే విషయంలో ఐదేండ్ల నిబంధనకు బ్రేక్
  • వక్ఫ్​ ఆస్తులపై ఇప్పుడున్న అధికారాలను మార్చొద్దని ఆదేశం
  • బోర్డు సీఈవోగా ముస్లిం వ్యక్తి ఉంటే బెటర్
  • సెంట్రల్ బోర్డులో ముస్లిమేతరులు నలుగురిని మించొద్దు
  • స్టేట్ బోర్డులో ముగ్గురే ముస్లిమేతరులు ఉండాలి
  • స్వాగతించిన ముస్లిం పెద్దలు.. సంఘాల ప్రతినిధులు

న్యూఢిల్లీ: వక్ఫ్‌‌(సవరణ) చట్టం–2025పై సుప్రీం కోర్టు సోమవారం మధ్యంతర తీర్పు వెలువరించింది. చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరిస్తూనే.. చట్టంలోని కీలక ప్రొవిజన్స్‌‌ను నిలిపివేస్తూ సీజేఐ జస్టిస్ బీఆర్‌‌.గవాయ్‌‌ నేతృత్వంలోని బెంచ్​ ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేండ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌‌ చేయడానికి చాన్స్ ఉంటుందన్న ప్రొవిజన్​పై స్టే విధించింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ధారించే నిబంధనలు తయారుచేసేవరకు ఈ స్టే అమల్లో ఉంటుందని చెప్పింది. చట్టంలోని కొన్ని సెక్షన్లకు మాత్రమే కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ఫ్‌‌ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. బోర్డ్‌‌ లేదా కౌన్సిల్‌‌లో గరిష్ఠంగా ముగ్గురు లేదంటే నలుగురు ముస్లిమేతర సభ్యులు మాత్రమే ఉండాలని చెప్పింది. చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఆఫీసర్‌‌గా ముస్లిం ఉండటమే మంచిదని అభిప్రాయపడింది. ఈమేరకు సీజేఐ జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహాతో కూడిన ధర్మాసనం 128 పేజీల మధ్యంతర తీర్పు వెలువరించింది.

ప్రత్యేక పరిస్థితుల్లోనే కల్గజేసుకుంటాం: బెంచ్

చట్టం ఏదైనప్పటికీ.. రాజ్యాంగ బద్ధంగానే ఉంటుందని జస్టిస్ బీఆర్. గవాయ్ అన్నారు. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే సుప్రీంకోర్టు కలగజేసుకుంటుందని చెప్పారు. ‘‘వక్ఫ్‌‌ (సవరణ) చట్టం – 2025లోని అన్ని ప్రొవిజన్స్​పై స్టే విధించాలని ఏ పిటిషనర్ కోరలేదు. అభ్యంతరకరంగా ఉన్నవాటిని మాత్రమే నిలిపివేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు. ఇరు పక్షాల ప్రయోజనాలను కాపాడటంతో పాటు తీర్పులో సమానత్వం పాటించాం. వక్ఫ్‌‌(సవరణ)చట్టం – 2025పై మొత్తంగా స్టే విధించలేం. వక్ఫ్ ఆస్తులా.. కావా? అన్నది కోర్టులే నిర్ణయిస్తాయి. ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆక్రమించిందా? లేదా? అనే అంశంపై నిర్ణయించే పవర్ అధికారులకు కట్టబెట్టిన సెక్షన్ పై స్టే విధిస్తున్నాం. టైటిల్ ఫైనల్ అయ్యేదాకా ఎవరినీ ఆస్తి నుంచి తొలగించకూడదు. థర్డ్ పార్టీ హక్కులు సృష్టించకూడదు’’ అని బెంచ్​ స్పష్టం చేసింది. 

తీర్పును స్వాగతించిన ముస్లిం సంఘాలు

సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పును స్వాగతిస్తున్నామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్​బీ) ప్రకటించింది. సూఫీ ఇస్లామిక్ బోర్డు సహా మరికొన్ని సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

మైనారిటీల హక్కులను సుప్రీం కోర్టు కాపాడింది: ఖర్గే

వక్ఫ్‌‌ చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మైనారిటీల హక్కుల రక్షణ కోసమే ఈ తీర్పు వెల్లడించిందన్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యంగా నిలబడ్డాయని తెలిపారు.

ఆ అధికారం కలెక్టర్​కు లేదన్న అత్యున్నత న్యాయస్థానం

వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్ అంశంపై తాత్కాలికంగా ప్రభుత్వ చర్యలు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇప్పటికే వక్ఫ్‌‌గా గుర్తించిన ఆస్తుల స్థితిని వెంటనే మార్చడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ‘‘వక్ఫ్ బోర్డుల సభ్యత్వం విషయానికొస్తే.. ముస్లిమేతరుల నియామకంపై అభ్యంతరాలు వచ్చాయి. కోర్టు తాత్కాలిక స్టే ఇవ్వలేదు. కానీ ఈ అంశంపై విచారణ అవసరం. సెంట్రల్ వక్ఫ్ బోర్డులో 22 మందిలో నలుగురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దు. స్టేట్ బోర్డులోని 11 మందిలో ముగ్గురికి మించి ముస్లిమేతరులను తీసుకోవద్దు. ప్రభుత్వ భూమి గుర్తింపు విషయంలో కలెక్టర్​కు అధికారం విషయంలో స్పష్టతివ్వాలి. ఆ అధికారం కలెక్టర్లకు లేదు. ట్రిబ్యూనల్స్‌‌కే ఉంది’’ అని సుప్రీం బెంచ్ పేర్కొంది.