మీ సారీ మాకు అక్కర్లేదు.. బాబా రామ్ దేవ్, బాలకృష్ణకు సుప్రీంకోర్టు మొట్టికాయలు

మీ సారీ మాకు అక్కర్లేదు..  బాబా రామ్ దేవ్, బాలకృష్ణకు సుప్రీంకోర్టు మొట్టికాయలు


న్యూఢిల్లీ:  ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు వేయించిన కేసులో క్షమాపణలను అంగీకరించబోమని పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. పతంజలి యాడ్  కేసులో తాము ఉదారంగా ఉండదలచుకోలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉత్తరాఖండ్  లైసెన్సింగ్  అథారిటీని కూడా తీవ్రంగా మందలించింది. అలాగే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ రిప్లైతో కూడా సంతృప్తిగా లేమని తెలిపింది. ఈ మేరకు జస్టిస్  హిమ కోహ్లి, జస్టిస్  ఏ అమానుల్లాతో కూడిన బెంచ్  పేర్కొంది. ఈ కేసులో రామ్ దేవ్, బాలకృష్ణ ముందుగా మీడియా వేదికగా క్షమాపణ చెప్పారని తెలిపింది. 

‘‘ఈ వ్యవహారం కోర్టుకు వచ్చేదాకా రామ్ దేవ్, బాలకృష్ణ మాకు అఫిడవిట్లు పంపలేదు. వాటిని మీడియాకు పంపారు. మంగళవారం రాత్రి 7.30 వరకూ అఫిడవిట్లను అప్ లోడ్  చేయలేదు. అంటే పబ్లిసిటీ కోసమే వారు ఇలా చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది” అని జస్టిస్  హిమ కోహ్లి అన్నారు. పతంజలి ఫౌండర్ల తరపున సీనియర్  అడ్వొకేట్  ముకుల్  రోహత్గి మాట్లాడుతూ తమ క్లైంట్లు ఇంతకుముందే క్షమాపణ చెప్పారని తెలిపారు. ఆ అఫిడవిట్లను ఆయన చదివి వినిపిస్తుండగా.. జస్టిస్  అమానుల్లా కలగజేసుకున్నారు. ‘‘మీరు తప్పుడు అఫిడవిట్  చదువుతున్నారు. ఎవరు దానిని డ్రాఫ్ట్  చేశారు? మేము ఆదేశించిన తర్వాత కూడా అఫిడవిట్లు ఇవ్వరా? ఇందుకు క్షమాపణ చెబితే సరిపోదు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు మీ క్లయింట్లకు(రామ్ దేవ్, బాలకృష్ణ) తగిన శాస్తి జరగాల్సిందే” అని జస్టిస్  అమానుల్లా పేర్కొన్నారు.

ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు?

తప్పుదోవ పట్టించేలా పతంజలి కంపెనీ చేసిన ప్రకటన విషయంలో లైసెన్సింగ్  ఇన్ స్పెక్టర్లు ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉత్తరాఖండ్  సర్కారును సుప్రీంకోర్ట్  బెంచ్  నిలదీసింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను వెంటనే సస్పెండ్  చేయాలని బెంచ్  ఆదేశించింది. ఈ కేసు విషయంలో ఉత్తరాఖండ్  ప్రభుత్వ అధికారులు ఏమీ చేయలేదని మండిపడింది. ‘‘తప్పుదోవ పట్టించే యాడ్  గురించి ఉత్తరాఖండ్  లైసెన్సింగ్  అథారిటీకి కేంద్ర ప్రభుత్వం 2021లో లేఖ రాసింది. దాంతో లైసెన్సింగ్  అథారిటీకి పతంజలి కంపెనీ వివరణ ఇచ్చింది. కేవలం ఒక్క హెచ్చరికతో కంపెనీని అథారిటీ వదిలేసింది. 

వార్నింగ్ లతో సరిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని 1954 చట్టం తెలుపుతోంది. రామ్ దేవ్, బాలకృష్ణతో అథారిటీ ఏదో ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది” అని బెంచ్  వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టును ఎగతాళి చేస్తున్నారని పేర్కొంది. ‘‘మీరు (లైసెన్సింగ్  అథారిటీ) పోస్ట్  ఆఫీసులా వ్యవహరిస్తున్నారు. తప్పుదోవ పట్టించే యాడ్  విషయంలో ఏమైనా లీగల్  సలహా తీసుకున్నారా? సిగ్గుచేటు. ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారు” అని ఉత్తరాఖండ్  సర్కారు తరపు అడ్వొకేట్ ను బెంచ్  మందలించింది. వారిపై చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్  తెలుపగా.. ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషమని బెంచ్  పేర్కొంది. 2018 నుంచి ఇప్పటిదాకా జిల్లా ఆయుర్వేదిక్, యునానీ ఆఫీసర్ల పోస్టులో ఉన్నవారు పతంజలి యాడ్లపై ఏమేం చర్యలు తీసుకున్నారో రిప్లై ఇవ్వాలని బెంచ్  ఆదేశించింది.