న్యూఢిల్లీ: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికల వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలను ఇండియాకు తీసుకువచ్చే విషయంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, జపాన్లోని రెంకోజీ ఆలయంలో భద్రపర్చిన తన తండ్రి అస్థికలను మాతృభూమికి తిరిగి తీసుకురావాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ ప్లాఫ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తన తండ్రికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కల్పించాలని ఆమె అభ్యర్థించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. మంగళవారం (ఆగస్ట్ 11) ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నేతాజీ అస్థికలను ఇండియాకు తీసుకువచ్చే విషయంపై స్పందించాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ రియాక్షన్పై ఉత్కంఠ నెలకొంది.
కాగా, భారత స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. బోస్ మరణానికి దారితీసిన పరిస్థితులు దశాబ్దాలుగా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే బోస్ మరణానికి స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు షా నవాజ్ కమిటీ, జస్టిస్ జి.డి. ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్లతో సహా సంవత్సరాలుగా వివిధ విచారణలు జరిగాయి.
షా నవాజ్ కమిటీ, జస్టిస్ జి.డి. ఖోస్లా కమిషన్ 1945 విమాన ప్రమాదం తర్వాత బోస్ మరణించారని నిర్ధారించగా.. 2005లో తన నివేదికను సమర్పించిన ముఖర్జీ కమిషన్ మాత్రం విమాన ప్రమాద సిద్ధాంతాన్ని తిరస్కరించింది. కానీ ప్రభుత్వం ముఖర్జీ కమిషన్ నిర్ధారణలను అంగీకరించలేదు. వివిధ విచారణల నివేదికలను పరిశీలించిన తర్వాత 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని భారత ప్రభుత్వం భావిస్తోంది.
