- పేపర్ ఆశ చూపి జేబులు కొల్లగొట్టేందుకు ముఠాల స్కెచ్
- రీ-ఎగ్జామ్ అభ్యర్థుల ఆందోళనే పెట్టుబడిగా నకిలీ దందా
- టెలిగ్రామ్ బ్యాన్ ఉన్నా వీపీఎన్ చాటున గుట్టుగా గ్రూపులు
- ఇన్ స్టా, సిగ్నల్, రెడిట్ తదితర సోషల్ యాప్స్ లో కూడా..
- నమ్మించేందుకు ఫేక్ ఆధార్ కార్డులు.. వాట్సాప్ చాటింగ్‌లు
- సోషల్ మీడియా వీడి ప్రిపరేషన్‌పైనే దృష్టి పెట్టాలని అధికారుల సూచన
హైదరాబాద్, వెలుగు: మెడికల్ సీటు సాధించాలనే విద్యార్థుల కలలను, వారిలో ఉన్న చిన్నపాటి ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నెల 21న దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో.. క్వశ్చన్ పేపర్ తమ దగ్గర ఉందంటూ సోషల్ మీడియా వేదికగా వల విసురుతున్నారు. మే 3న జరిగిన పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంతో అప్రమత్తమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), కేంద్ర ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. పేపర్ లీక్ అయ్యేందుకు ఎక్కడా ఆస్కారం లేకపోయినా.. ‘‘తమ దగ్గర ఒరిజినల్ పేపర్ ఉంది.. ఎక్కువ స్కోర్ చెయ్యొచ్చు’’ అని నమ్మిస్తూ అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు గుంజేందుకు కేటుగాళ్లు ప్లాన్ వేశారు. ఇది కేవలం డబ్బులు వసూలు చేసే స్కామ్ మాత్రమేనని, విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందకుండా తమ ప్రిపరేషన్‌పైనే దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
డిస్కషన్ గ్రూపులే కేటుగాళ్ల అడ్డాలు...
సాధారణంగా నీట్ అభ్యర్థులు తమ అనుమానాల నివృత్తి కోసం, మాక్ టెస్టులు, పాత పేపర్ల ప్రిపరేషన్ కోసం సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్ గ్రూపులను నిర్వహిస్తుంటారు. సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు ఇలాంటి గ్రూపులనే తమ వేట స్థావరాలుగా మార్చుకున్నారు. విద్యార్థుల చాటింగ్ లను నిశితంగా గమనిస్తూ.. పరీక్షపై ఎక్కువ ఆందోళన ఉన్న వారిని ఎంపిక చేసుకుంటున్నారు. పర్సనల్ గా మెజెస్ లు పంపి, క్వశ్చన్ పేపర్ డీల్ మాట్లాడుతున్నారు. టెలిగ్రామ్ యాప్ ను ప్రభుత్వం బ్లాక్ చేసినప్పటికీ.. వీపీఎన్ టెక్నాలజీ ద్వారా ఐపీ అడ్రస్ లను మారుస్తూ గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. టెలిగ్రామ్ మాత్రమే కాకుండా వాట్సాప్, సిగ్నల్, రెడిట్, జీ-మెయిల్స్ వంటి వేదికల ద్వారా విద్యార్థులను అప్రోచ్ అవుతున్నారు.
ఫేక్ డాక్యుమెంట్స్ తో నమ్మబలుకుతూ..
ఈ కేటుగాళ్లు విద్యార్థులను నమ్మించేందుకు అత్యంత తెలివిగా వ్యవహరిస్తున్నారు. తాము నిజమైన వ్యక్తులమేనని భ్రమ కలిగించేందుకు ఇతర వ్యక్తుల ఫొటోలతో సృష్టించిన నకిలీ ఆధార్ కార్డులను, తప్పుడు సిమ్ కార్డులను వాడుతున్నారు. నమ్మకం కుదరడం కోసం ఫేస్- టు-ఫేస్ డీలింగ్స్, ఆఫ్- లైన్ డీలింగ్స్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ముందుగా సగం డబ్బులు కట్టాలని, ప్రశ్నలు మ్యాచ్ అయ్యాక మిగిలిన మొత్తం చెల్లించాలని కండీషన్లు పెడుతున్నారు. తీరా డబ్బులు అకౌంట్ లో పడగానే ఫోన్ నంబర్లు మార్చేయడం, గ్రూపుల నుంచి విద్యార్థులను తొలగించి బ్లాక్ చేయడం వీరి నైజం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరం ఉండాలని సూచిస్తున్నారు.
నకిలీ వార్తలు నమ్మొద్దు
నీట్ పరీక్ష క్వశ్చన్ పేపర్లు, మెడికల్ సీట్ల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలను ఎవరూ నమ్మవద్దు. ఈ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుంది. కొంతమంది కేటుగాళ్లు వీపీఎన్‌లు వాడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టింది. అడ్డదారులను ఆశ్రయించి విద్యార్థులు తమ విలువైన కెరీర్ ను నాశనం చేసుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేయండి. - వీసీ సజ్జనర్,
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్
సోషల్ మీడియాకు దూరం ఉండాలి:
గతంలో వ్యవస్థలు ఫెయిలయ్యాయి కాబట్టి ఈసారి ఎగ్జామ్ పగడ్బందీగా ఉంటుంది. ఇప్పుడు పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కేవలం డబ్బులు గుంజే ప్రయత్నాలు మాత్రమే. విద్యార్థులు పరీక్ష ముగిసే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం. తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి పెంచకుండా, వారిని ఉత్సాహంగా పరీక్షకు సిద్ధం చేయాలి.
- మల్లోజు సత్యనారాయణ చారి,
మెడికో పేరెంట్స్ అసోషియేషన్
