రైతు బజార్లలో ఆకు కూరలు, కూరగాయల కొరత

రైతు బజార్లలో ఆకు కూరలు, కూరగాయల కొరత

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని మార్కెట్లు, రైతు బజార్లలో ఆకు కూరలు, కూరగాయల కొరత ఉంటోంది. ఉదయం 10 గంటలు దాటితే గల్లీలోని మార్కెట్ల నుంచి రైతు బజార్ల దాకా ఆకుకూరలు దొరకట్లేదు. డిమాండ్‌‌‌‌కు సరిపడా దిగుమతులు లేకపోవడంతో వాటి రేట్లు సైతం ఒక్కసారిగా పెరిగాయి. కొత్తి మీర ఒక్క కట్ట  రూ.20 ఉంది. అదే విధంగా ఆకు కూరలు ఒక్క కట్ట రూ.40 నుంచి రూ.70 వరకు రేటు ఉంటోంది, ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతోనే ఇప్పుడు కొరత పాటు రేట్లు పెరుతున్నాయని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.   పాలకూర, తోటకూర, గోంగూర, పొన్నగంటి, బచ్చలి, మెంతి, కొత్తిమీర, సోయ, గంగవాయిలి రేట్లు భారీగా పెరిగాయి.   కొత్తిమీర, మెంతికూర, పాలకూర ఒక కట్ట  రూ.40కి పైగానే ఉంది. భారీ వర్షాలకు  ఆకుకూరలు బాగా దెబ్బతిన్నాయి. కొందరు సాగు కూడా చేయలేదు. ఉత్పత్తి తగ్గడంతో దిగుమతులు లేక ఒక్కసారిగా రేట్లు పెరిగినట్లు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. సిటీలోని హోల్ సేల్ మార్కెట్లు, రైతుబజార్లు, బయటి మార్కెట్లలో అన్ని రకాల ఆకు కూరలకు  దాదాపు  150 టన్నుల వరకు డిమాండ్ ఉంది. సాధారణ రోజుల్లో ఇంత మొత్తం దిగుమతులు అయినప్పటికీ ప్రస్తుతం  80 టన్నుల వరకు మాత్రమే దిగుమతి ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

మరో 20 రోజులు ఇంతే..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల, మొయినాబాద్, బాలాపూర్, షాబాద్, షాద్ నగర్, మేడ్చల్‌‌‌‌, కీసర, ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌, శామీర్‌‌‌‌పేట వికారాబాద్ ప్రాంతాల్లోని గ్రామాల నుంచి సిటీలోని మార్కెట్లకు ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా దిగుమతులు అవుతాయి. దీంతో పాటు బెంగళూరు, మహారాష్ట్ర, ఏపీ నుంచి కూడా ఆకుకూరలు, కూరగాయలు సిటీలోని రైతు బజార్లు, మార్కెట్లకు వస్తుంటాయి.  వర్షాలు ఎక్కువగా కురవడంతో ఆకుకూరలు పూర్తిగా దెబ్బతిని కొన్ని ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట కూడా పాడైయిందని  రైతులు చెబుతున్నారు. మళ్లీ పంటలు చేతికి రావడానికి టైమ్ పడుతుందని ఇంకో 20 రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చంటున్నారు.