
- 1.50 లక్షల టన్నులకు పైగా నిలిచిన ఉత్పత్తి
- గనుల వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
- కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్‌లోకి వెళ్తున్న ఉద్యోగులను అడ్డుకున్న కార్మికులు
- కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని లీడర్ల డిమాండ్
భద్రాద్రికొత్తగూడెం/కోల్‌బెల్ట్/గోదావరిఖని, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం నిర్వహించిన సమ్మెలో సింగరేణి కార్మికులు సైతం పాల్గొన్నారు. రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న వారు సైతం డ్యూటీకి హాజరుకాలేదు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉత్పత్తి నిలిచిపోయి ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటకు రాలేదు. సమ్మె సందర్భంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా మొదటి షిఫ్ట్‌లో 25,848 మంది కార్మికులు డ్యూటీకి రావాల్సి ఉండగా.. 21,504 మంది, రెండో షిఫ్ట్‌లో 7,273 మంది కార్మికులకుగానూ 6,107 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
రెండు షిఫ్ట్‌లలో కలిపి కేవలం 15.37 శాతం మాత్రమే అటెండెన్స్ నమోదైంది. డ్యూటీకి హాజరైన వారంతా అత్యవసర సేవలు అందించే వారేనని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. సుమారు 1.50 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాల్లోని 11 అండర్ గ్రౌండ్ మైన్స్, నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లోని 16 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనగా... సుమారు 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం రీజియన్‌లో 58 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది.
కార్మికుల హక్కులను కాలరాసే కుట్ర చేస్తున్నరు
మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిపై, శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాలోని నేషనల్ హైవే 63పై కార్మిక సంఘాలు ధర్నాకు దిగగా... మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీఫ్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల లీడర్లు వాసిరెడ్డి సీతారామయ్య, బాజీ సైదా, సలేంద్ర సత్యనారాయణ, శంకర్‌రావు, సమ్మయ్య, భూమయ్య, సురేందర్‌రెడ్డి, జె.రవీందర్, ఎస్.వెంకటస్వామి, భూపాల్, జె.శ్రీనివాస్ మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో బలం ఉందన్న భావనతో చట్టాలను రద్దు చేసి, నాలుగు కోడ్‌లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
ప్రధాని ఇప్పటికైనా స్పందించి కార్మిక చట్టాలను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతాంగ పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు చేపట్టిన ఒక్కరోజు సమ్మెను సక్సెస్ అయిందని ప్రకటించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో సమ్మెలో పాల్గొన్న కార్మికులకు జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. పది గంటల పని విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి.
కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా
సమ్మె సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, టీబీజీకేఎస్, ఇఫ్టూ సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగి ఆఫీస్‌లోకి వెళ్తున్న ఉద్యోగులు, ఆఫీసర్లను అడ్డుకొని సమ్మెకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులు ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.