దసరా సెలవులు తగ్గించాలంటూ ఎస్ఈఆర్టీ లేఖ

దసరా సెలవులు తగ్గించాలంటూ ఎస్ఈఆర్టీ లేఖ

హైదరాబాద్: దసరా సెలవులను 14 రోజుల నుంచి 9 రోజులకు కుదించాలని ఎస్ఈఆర్టీ  డైరెక్టర్ ఎం రాధారెడ్డి  విద్యా శాఖ డైరెక్టర్ కి లేఖ రాశారు. దసరా పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 26.09.2022 నుంచి 09.10.2022 వరకు14 రోజులు సెలవులు ప్రకటించిందన్నారు. అయితే ఆగస్టులో కురిసిన వర్షాలు, ఈ నెలలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవం కారణంగా విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు ప్రకటించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ సెలవులను భర్తీ చేసుకునేందుకు ఈనెల 30  వరకు రాష్ట్రంలో పాఠశాలలు పని చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 14 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చుకోవచ్చని, కాకపోతే ఈ ఏడాది నవంబర్, డిసెంబర్, 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కు సంబంధించి రెండో శనివారాల్లో సెలవులు రద్దు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇక.. ఎస్ఈఆర్టీ రాధారెడ్డి లేఖపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, పేరేంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 14 రోజుల సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు వెళ్లడానికి రైళ్లు, బస్సులకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామని, ఇప్పుడిలా సెలవులు కుదిస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల దసరా సెలవులపై గందరగోళం నెలకొంది.