
హైదరాబాద్, వెలుగు : ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ చదివే స్టూడెంట్లకు ఎస్ ఏ–2 (వార్షిక) పరీక్షలు వచ్చే నెల 8న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి సోమవారం పరీక్షల టైమ్ టేబుల్‌ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8 నుంచి 19 వరకూ పరీక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. ఏప్రిల్ 8,10,13,15 తేదీల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని తెలిపారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు ఏప్రిల్ 8,10,13,15,16,18 తేదీల్లో పరీక్షలుంటాయని చెప్పారు.
అయితే, ఎనిమిదవ తరగతి స్టూడెంట్లకు సైన్స్ పేపర్ మాత్రం ఉదయం ఫిజిక్స్, మధ్యాహ్నం బయాలజీ ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన అన్ని పరీక్షలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.45 గంటల వరకూ కొనసాగుతాయన్నారు. నైన్త్ క్లాసుకు మాత్రం 19 వరకూ పరీక్షలు కొనసాగుతాయని, సైన్స్ పేపర్ ను రెండు రోజుల్లో వేర్వేరుగా పెట్టనున్నట్టు వెల్లడించారు.