బీటెక్ మేనేజ్ మెంట్ల సీట్ల భర్తీకి షెడ్యూల్

బీటెక్ మేనేజ్ మెంట్ల సీట్ల భర్తీకి షెడ్యూల్
  • నేటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా (బి–కేటగిరి) సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి షెడ్యూల్  విడుదల చేసింది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో మేనేజ్ మెంట్  కోటా కింద 30 శాతం సీట్ల భర్తీకి గురువారం నోటిఫికేషన్  రిలీజ్  చేయనున్నారు. 

అలాగే ఇదే రోజు కాలేజీల వారీగా నోటిఫికేషన్  జారీ చేస్తారు. ఇదే రోజు నుంచి ఈ నెల 31 వరకూ ఆన్​లైన్​లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. మైనారిటీ, నాన్ మైనారిటీ ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే షెడ్యూల్ అమలవుతుందని కౌన్సిల్  ప్రకటించింది. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 15న నిర్ణీత ఫార్మాట్​లో లిస్టులను అందించాల్సి ఉంటుంది. 

జేఈఈ, ఎంసెట్ ర్యాంకర్లకు ప్రాధాన్యం

రాష్ట్రంలో సుమారు 30 వేల వరకూ మేనేజ్ మెంట్  కోటా సీట్లున్నాయి. వాటన్నింటినీ ప్రైవేట్  మేనేజ్ మెంట్లు ఇష్టారాజ్యంగా అమ్ముకోరాదని, మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించాలని అధికారులు చెప్తున్నారు. ప్రతి కోర్సులో మంజూరైన ఇన్ టెక్​లో 15 శాతం సీట్లకు మించకుండా ఎన్ఆర్ఐ కోటా ద్వారా భర్తీ చేసుకోవచ్చని తెలిపారు. 

మిగిలిన సీట్ల విషయంలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు, క్వాలిఫై అయిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకర్లకు ప్రయారిటీ ఇచ్చి, సీట్లను భర్తీ చేయాలని తెలిపారు.