స్కూల్ పుస్తకాల రేట్లు పెరిగినయ్

స్కూల్ పుస్తకాల రేట్లు పెరిగినయ్
  • పోయినేడుతో పోలిస్తే 50–70 %  ఎక్కువ
  • కాగితం ధర పెరిగిందంటూ రేట్లు పెంచిన సర్కార్ 
  • ఇంగ్లిష్ మీడియం కంటే తెలుగు మీడియం బుక్స్ ధరలే ఎక్కువ
  • ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ల పేరెంట్స్ ఆందోళన 
  • నాలుగైదు రోజుల్లో మార్కెట్లోకి కొత్త పుస్తకాలు 

హైదరాబాద్,వెలుగు: కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న పేరెంట్స్​పై రాష్ట్ర సర్కార్ మరో భారం మోపింది. ఓవైపు ఆయా బడుల్లో ఫీజులు తగ్గించాలని పేరెంట్స్ కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వం... మరోవైపు పుస్తకాల రేట్లనేమో భారీగా పెంచేసింది. పోయినేడుతో పోలిస్తే ఏకంగా 50–70% ధరలు పెంచింది. రాష్ట్రంలో సర్కార్, ఎయిడెడ్ స్కూళ్లలో ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు అందజేస్తుంది. కానీ ప్రైవేట్ బడుల్లో చదివే వారంతా సొంతంగా మార్కెట్లో కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు సర్కార్ రేట్లు పెంచడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు బడుల్లో ఫీజులు తగ్గించకపోగా, పుస్తకాల రేట్లు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని క్లాసుల పుస్తకాల రేట్లు పెంచారు. 2021–22లో టెన్త్ క్లాసులో 8 పుస్తకాలకు రూ.686 రేటు ఉంటే, ఈ ఏడాది అది రూ.1074కు పెరిగింది. ఈ లెక్కన ఒక్క టెన్త్ క్లాసుకే 64 శాతం రేట్లు పెరిగాయి. అయితే ఒక్కో సబ్జెక్టుకు ఒక్కోలా ధరలు పెరిగాయి. ఉదాహరణకు మ్యాథ్స్ పుస్తకం రేటు రూ.145 నుంచి రూ.224కు పెరగ్గా, హిందీ పుస్తకం ధర రూ.32 నుంచి రూ.64కు పెరిగింది. ప్రైమరీలో నాల్గో తరగతిని పరిశీలిస్తే పోయినేడు ఐదు పుస్తకాల ధర రూ.260 ఉండగా, ఇప్పుడు రూ.404కు పెరిగింది. పైగా ఇంగ్లిష్ మీడియం కంటే తెలుగు, ఉర్దూ మీడియం పుస్తకాల రేట్లే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు నాల్గో తరగతి మ్యాథ్స్ బుక్​ ఇంగ్లిష్ మీడియంలో రూ.90 ఉంటే, తెలుగు మీడియంలో రూ.117 ఉంది. ఇవన్నీ సర్కార్ నిర్ణయించిన రేట్లు కాగా, మార్కెట్లో వీటికి అదనంగా మరో 20–30% పెంచి అమ్ముతారు. ఇవే పుస్తకాలను ప్రైవేటు బడుల్లో  50–100% రేటు పెంచి అమ్ముతున్నారు. దీనిపై ఏటా అనేక ఫిర్యాదులు వచ్చినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 
పేజీకి 0.55 పైసలు... 
పుస్తకాల రేట్లు పెరగడానికి కాగితం ధర పెరగడమే కారణమని అధికారులు చెబుతున్నారు. ‘‘పోయినేడు కాగితం టన్ను ధర రూ.60 వేలు ఉంటే, ఇప్పుడు రూ.97 వేలకు పెరిగింది. అంటే టన్నుకు రూ.37 వేలు ఎక్కువైంది. యూరప్ దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకునే కాగితాన్ని కాదని.. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో మన దగ్గర కొరత ఏర్పడింది. అందుకే రేట్లు పెరిగాయి” అని అధికారులు పేర్కొన్నారు. 2020–21లో ఒక్కో పేజీకి 0.35 పైసలు రేటు పడగా, ప్రస్తుతం అది 0.55 పైసలకు పెరిగిందని చెప్పారు. 
కోటి 28 లక్షల పుస్తకాలు... 
అన్ని బడుల్లో ఎస్సీఈఆర్టీ రూపొందించిన పుస్తకాలనే వాడాలి. ప్రైవేటు బడుల్లోని స్టూడెంట్ల కోసం ప్రభుత్వం ఈ పుస్తకాలను ప్రింట్ చేసి మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతుంది. రాష్ట్రంలో 10,800 ప్రైవేటు బడులుంటే, వాటిలో 30 లక్షల మంది చదువుతున్నారు. ప్రైమరీ స్కూల్స్​వరకు ఏ సిలబస్ పుస్తకాలైనా వాడుకునే వెసులుబాటు మేనేజ్మెంట్లకు ఉంది. అయినా కొన్ని పుస్తకాలను ప్రభుత్వం ప్రింట్ చేస్తోంది. ఈసారి  ప్రైవేటు స్కూల్ విద్యార్థుల కోసం 1.28 కోట్ల పుస్తకాలను ప్రింట్ చేయించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.