14 ఏళ్లకే బడి బంద్​..అయినా బిలియనీర్​!

14 ఏళ్లకే బడి బంద్​..అయినా బిలియనీర్​!
  • నమ్మకం ఉంటే పరిస్థితులు మారతాయ్‌    
  • చిన్న నాటి  మెమొరీస్​ను పంచుకున్న జెరోధా ఫౌండర్‌ నిఖిల్‌‌ కామత్‌

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: స్కూల్‌ డ్రాప్‌ అవుట్‌ అయినా..బిలియనీర్‌‌గా మారగలిగాడు. నెలకు  రూ. 8 వేలకే పనిచేస్తూ..దేశంలో అతిపెద్ద బ్రోకరేజి కంపెనీ జెరోధాను ఏర్పాటు చేశాడు. నిఖిల్‌‌ కామత్.. తన అన్నయ్య నితిన్‌‌ కామత్‌‌తో కలిసి ఇండియాలో ట్రేడింగ్‌, ఇన్వెస్టింగ్‌ను మరింత సులభం చేశారు. ప్రస్తుతం ట్రూ బీకాన్ పేరుతో అసెట్ మేనేజ్‌‌మెంట్ కంపెనీని కూడా నడుపుతున్నారు. కిందటేడాది ఫోర్బ్స్‌‌ 10‌‌‌‌0 రిచ్‌‌లిస్ట్‌‌లో చోటు సంపాదించిన నిఖిల్‌‌, తన జర్నీ గురించి శనివారం పంచుకున్నారు.

ఫైనల్‌‌ ఎగ్జామ్స్ రాయనివ్వలేదు..
ఇండియన్ ఎడ్యుకేషన్‌‌ సిస్టమ్‌‌ అంటే నచ్చేది కాదని, 14 ఏళ్లకే బిజినెస్‌‌ చేయడం మొదలు పెట్టానని ఓ ఫేస్‌‌బుక్ ఇంటర్వ్యూలో నిఖిల్‌‌ పేర్కొన్నారు. ‘మా నాన్న బ్యాంకులో పనిచేసేవారు.  తరచూ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ అయ్యేవాళ్లం.  నాకు 9 ఏళ్లు ఉన్నప్పుడు బెంగళూరులో సెటిల్ అయ్యేంత వరకు తరచూ సిటీలు మారుతుండేవాళ్లం’ అని నిఖిల్‌‌ తన చిన్న నాటి స్టోరీని పంచుకున్నారు. ఆ తర్వాత స్కూల్ అంటే అసహ్యం పెరిగిందని,  ఎదైనా చేయమంటారు కానీ,  ఎందుకు చేయాలో చెప్పేవారు కాదని అన్నారు. మెల్లగా మెల్లగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌‌పై ఆసక్తి పోయిందని, 14 ఏళ్ల వయసులో మొదటి సారిగా బిజినెస్‌‌ చేయడం ప్రారంభించానని అన్నారు. ఇంట్లో తెలియకుండా పాత మొబైల్‌‌ ఫోన్లను అమ్మేవాడినని చెప్పుకొచ్చారు. ‘ కానీ, తర్వాత ఇంట్లో అమ్మకి తెలిసింది. ఈ బిజినెస్‌‌ తనకి నచ్చలేదు. పాత ఫోన్లను టాయిలేట్‌‌లో  పడేసింది’ అని పేర్కొన్నారు.  ఫైనల్ ఎగ్జామ్స్‌‌ రాయడానికి స్కూల్‌‌ వాళ్లు అనుమతించలేదని, అప్పుడే స్కూల్‌‌ నుంచి డ్రాప్ అవుట్ అవుదామని నిర్ణయించుకున్నానని నిఖిల్‌‌ చెప్పారు. ‘మా పేరెంట్స్ ఎప్పుడూ ఒకటే చెప్పేవాళ్లు..మేము సిగ్గుపడేలా ఏ పని చేయాకు. నేను మ్యాథ్య్స్‌‌ బాగా చేసేవాడిని. చెస్ బాగా ఆడేవాడ్ని. దీంతో నేను తెలివైన వాడినని వారు అనుకునేవాళ్లు’ అని పేర్కొన్నారు.

17 ఏళ్లకే ట్రేడింగ్‌‌లోకి..
స్కూల్‌‌ డ్రాప్‌‌ అవుట్ అయ్యాక నిఖిల్‌‌ దగ్గర ఏ ప్లాన్ లేదు. తన రిలేటివ్స్‌‌ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటూ అడుగుతుండే వారని, ఏం చెప్పాలో తెలిసేది కాదని ఆయన చెప్పారు. ‘17 ఏళ్లు ఉన్నప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఫేక్‌‌ పెట్టి నెలకు రూ. 8 వేల శాలరీకి ఓ జాబ్‌‌లో జాయిన్ అయ్యాను.  సాయంత్రం 4 నుంచి ఉదయం 1 వరకు కాల్ సెంటర్‌‌‌‌లో పనిచేసేవాడ్ని. ఉదయం పూట ట్రేడింగ్‌‌లో నా లక్కును పరిక్షించుకునేవాడిని’ అని నిఖిల్ అన్నారు.  ‘నేను చాలా నేర్చుకున్నా. ఒక్కసారి ఫ్యామిలీ, రిలేటివ్‌‌ల నుంచి బయటపడితే, అప్పుడు బయట ప్రపంచమేంటో అర్థమవుతుంది’ అని చెప్పుకొచ్చారు.  ‘నాకు 18 ఏళ్లు వచ్చేటప్పుడు సరిగ్గా ట్రేడింగ్ చేయడం నేర్చుకున్నా. నాన్న తన దగ్గరున్న సేవింగ్స్‌‌ను ఇచ్చి, సరిగ్గా మేనేజ్ చేయు అని మాత్రమే చెప్పారు. ఆయన నన్ను గుడ్డిగా నమ్మారు’ అని అన్నారు. ఆయన తన కాల్ సెంటర్ జాబ్‌‌ను విడిచి పెట్టి, తన అన్నయ్య నితిన్‌‌ కామత్‌‌తో కలిసి కామత్‌‌ అసోసియేట్స్‌‌ను ప్రారంభించారు. 2010 లో జెరోధాను తీసుకొచ్చారు. బిలియనీర్‌‌‌‌‌‌గా మారినంత మాత్రన ఏం చేంజ్ కాలేదని నిఖిల్‌‌ పేర్కొన్నారు. ‘ఇప్పటికీ కూడా రోజులో ఎక్కువ టైమ్‌‌ పనిచేస్తున్నా. ‘ఇది పోతే నా పరిస్థితేంటీ? ’ అనే ఇన్‌‌సెక్యూరిటీలోనే ఉన్నా. నా సలహా ఏంటంటే ఇప్పుడు ఆందోళన పడుతున్న పరిస్థితులు ఐదేళ్ల తర్వాత పెద్ద ఇష్యూల్లా అనిపించవు. అందుకే ఈ రోజు ఏం చేయాలో  అది చేస్తే సరిపోతుంది. గుడ్డి నమ్మకం ఉంటే చాలు అన్ని పరిస్థితులు కలిసొస్తాయి..ఏదో ఒకలా?’ అని నిఖిల్‌‌ అన్నారు.