
హైదరాబాద్, వెలుగు: కస్తూర్బా విద్యాలయాల(కేజీబీవీ)స్పెషల్ ఆఫీసర్ల(ఎస్ఓ)కు స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన వార్నింగ్ ఇచ్చారు. రెండ్రోజుల్లో మోడల్ స్కూల్ హాస్టళ్ల బాధ్యతలను చేపట్టకుంటే ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తామని హెచ్చరించారు. సోమవారం సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)ఏఎస్పీడీ రమేశ్, కేజీబీవీ స్టేట్ కోఆర్డినేటర్ శిరీషతో కలిసి డీఈఓలు, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్(జీసీడీఓ)లు, కేజీబీవీ ఎస్ఓలతో ఆమె జూమ్‌లో సమావేశమయ్యారు. ఇటీవల మోడల్ స్కూల్ హాస్టళ్ల బాధ్యతలను స్కూల్ ప్రిన్సిపాల్స్ నుంచి తప్పించి కేజీబీవీ ఎస్ఓలకు అప్పగించారు. అయితే, తాము ఆ బాధ్యతలను తీసుకోబోమని కేజీబీవీ ఎస్ఓలు పట్టుబట్టారు.
ఇదే అంశంపై ఎస్ఓలపై డైరెక్టర్ ఫైర్ అయ్యారు. మోడల్ స్కూల్ హాస్టళ్ల బాధ్యతలు చేపట్టని ఎస్ఓలకు మంగళవారం షోకాజ్ నోటీసులివ్వాలని నిర్ణయించారు. అప్పటికీ స్పందించకపోతే టర్మినేట్ చేయాలని డీఈఓలను ఆదేశించారు. డైరెక్టర్ వ్యాఖ్యలపై కేజీబీవీ ఎస్ఓలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజీబీవీ ఎస్ఓలపై డైరెక్టర్ బెదిరింపులను టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్సంఘాల నేతలు ఖండించారు. మోడల్ స్కూల్ హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ ఆదేశాలతో 177 మంది ఎస్ఓలకు డీఈఓలు ఫోన్లు చేశారు. వెంటనే విధుల్లో చేరాలని.. లేకపోతే షోకాజ్ నోటీసులిస్తామని హెచ్చరించారు.