తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సుధా కొంగర కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక చిత్రం ' పరాశక్తి'. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ జనవరి 10న విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఊహించని విధంగా ఈ మూవీ రిలీజ్ కు ముందే సెన్సార్ చిక్కుల్లో పడింది. ఇప్పటికే దళపతి విజయ్ ‘జననాయగన్’ కూడా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు 'పరాశక్తి' కూడా చిక్కుల్లో పడటంతో కోలీవుడ్ లో రాజకీయం హీటెక్కింది.
సెన్సార్ సెగ?
తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పరాశక్తి’, 'జననాయగన్' ముచ్చటే. 1965 నాటి చారిత్రాత్మక హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'పరాశక్తి', విడుదలకు కేవలం రెండు రోజుల ముందు సెన్సార్ బోర్డు (CBFC) వద్ద ఆగిపోయింది. ఈ సినిమాకు సుమారు 23 కట్స్ సూచించినట్లు సమాచారం. అయితే, చరిత్రను వక్రీకరించలేమని, వాస్తవాలను అలాగే చూపాలని పట్టుబడుతున్న చిత్ర యూనిట్, సినిమాను రివైజింగ్ కమిటీకి పంపింది.
అసలు చిక్కు ఎక్కడ?
ఈ సినిమా కేవలం ఒక కల్పిత కథ కాదు. అప్పట్లో అన్నామలై యూనివర్సిటీలో ప్రాణాలర్పించిన విద్యార్థి నేత రాజేంద్రన్ జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుందని టాక్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ ‘భాషా ఉద్యమం’ అంశం సెన్సిటివ్‌గా మారడంతో సెన్సార్ బోర్డు ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు విజయ్ ‘జననాయగన్’ సినిమా రాజకీయ ప్రవేశానికి వేదికగా నిలుస్తుంటే, మరోవైపు డిఎంకె (DMK) మద్దతు ఉన్న రెడ్ జెయింట్ మూవీస్ ‘పరాశక్తి’ని పంపిణీ చేస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సెన్సార్ బోర్డు వరకు చేరింది.
Also Read : నంబర్ 1 ట్యాక్స్ పేయర్ రష్మిక
బుకింగ్స్ నిలిపివేత..
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు వారం ముందే బుకింగ్స్ జోరుగా సాగుతాయి. కానీ 'పరాశక్తి'కి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. మరో వైపు సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో విజయ్ జననాయగన్ సినిమా విడుదల వాయిదా పడింది.సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇష్యూ చేయకపోవడం.. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఈ విషయంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ పరిణామాలతో జననాయగన్ సినిమా విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది.. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు రీఫండ్ ఇస్తామని పలు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే ఇలాంటి పరిణామాల వల్ల ఇది నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
జనవరి 10న ‘పరాశక్తి’ థియేటర్లలోకి వచ్చేనా?
శివకార్తికేయన్ సరసన శ్రీలీల నటించింది. ఈ సినిమాలోనే శ్రీలీల తమిళంలోకి అడుగుపెడుతోంది. ఇందులో శివకార్తికేయన్ లోకో పైలట్‌గా కనిపిస్తుండగా, రవి మోహన్ (జయం రవి), అథర్వ, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ అభిమానులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. ప్రస్తుతం మేకర్స్ సెన్సార్ క్లియరెన్స్ కోసం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. జనవరి 9 నాటికైనా సర్టిఫికేట్ చేతికి వస్తేనే జనవరి 10న ‘పరాశక్తి’ థియేటర్లలోకి వస్తుంది. లేదంటే విజయ్ సినిమా మాదిరిగానే శివకార్తికేయన్ మూవీ కూడా వాయిదా పడే ప్రమాదం ఉందంటున్నారు సినీ వర్గాలు.
