సమ్మర్ హాలిడేస్ : హైదరాబాద్ టూరేద్దాం

సమ్మర్ హాలిడేస్ : హైదరాబాద్ టూరేద్దాం

హైదరాబాద్ : సమ్మర్‌ సెలవుల్లో హైదరాబాద్‌కు పోవాలి. జూపార్క్‌, సాలార్‌ జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ చూడాలి. వీలైతే ఇంకొన్ని ప్లేస్‌లు కూడా! ఇది చాలామంది పిల్లలు, పెద్దలు అనుకునేదే. కానీ తీరా వచ్చాక మాత్రం… అనుకున్నవి చూడకుండనే సెలవులు అయిపోయినయ్‌ అని నిరాశగా తిరిగి వెళ్తుంటరు. ఇట్ల కాకుండ ఉండాలంటే… చూడాల్సిన వాటి గురించి ముందుగానే తెలుసుకోవాలి. ఎప్పుడెప్పుడు అవి ఓపెన్‌ ఉంటాయి, ఏయే టైమింగ్స్‌ ఉన్నాయి… ఏ దారెంట పోతే రెండు, మూడు ప్లేస్‌లు కవర్‌ చేయొచ్చు. ఈ వివరాలన్నీ తెలుసుకుంటే రాజధాని టూర్‌ చుట్టేయడం ఈజీ అవుతుంది. మీ కోసమే స్పెషల్‌గా ఈ హైదరాబాద్‌ టూర్‌ గైడ్‌.

క్రీ. శ. 1591.. ‘చెంచలం’ అనే పేట వద్ద గోల్కొండ రాజు మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా చార్మినార్‌ నిర్మాణానికి పూనుకున్నాడు. నీటిలోని చేపల వలె ఈ నగరంలోని ప్రజలు కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని అప్పుడాయన దేవుడిని వేడుకున్నాడు. ఆయన ఆశ నెరవేరి నగరం విస్తరించింది. ఆయన ప్రార్థన ఫలించింది. కోటి మందిని కడుపులో దాచుకున్న నగరం హైదరాబాద్‌. హైదరాబాద్‌ అంటే ఐటీ, రాజకీయాలు, కొలువులు చదువులే కాదు, రోజూ వార్తల్లో వినిపించని ఎన్నో విశేషాలుంటాయి. నాలుగు వందల ఏళ్ల చరిత్రలో ప్రపంచ దేశాల నుంచి ఎన్నో జాతుల వాళ్లు బతకడానికొచ్చారు. అన్ని మతాలను అక్కున చేర్చుకుని చరిత్రలో సమతకు పెట్టినిల్లుగా నిలిచింది. వేర్వేరు వేషభాషల ప్రజలందరినీ ఒక్కటి చేసిన చరిత్ర పేరు హైదరాబాద్‌. చరిత్రకారుడు ట్రావెర్నియర్‌తో ‘భాగ్‌నగర్‌’ అని ప్రశంసలందుకున్న ఉద్యాన వనాల నగరం ఇప్పుడు ఉద్యోగాల నగరమయింది. గోల్కొండ వజ్రాలు, ముత్యాల మార్కెట్లతో మొదలైన హైదరాబాద్‌ వైభవం నేటి ఐటీ అభివృద్ధితో ముందడుగేస్తూనే ఉంది.

హైదరాబాద్‌  ప్రగతి ప్రయాణంలో ఎన్నో చారిత్రక పరిణామాలు. కుతుబ్‌ షాహీలు తవ్వించిన చెరువులు, ఆ చెరువులపై అసఫ్‌ జాహీలు కట్టించిన ఉద్యాన వనాలు ఈ నగర ప్రజలను ఇప్పటికీ సేద తీరుస్తున్నాయి. బ్రిటీష్‌ పాలకుల జ్ఞాపకాలు, ఆర్మేనియన్ల ఆనవాళ్లు (ఉప్పుగూడ సమాధులు), పారశీల జ్ఞాపకాలు (అగ్నిదేవాలయం), రెండో ప్రపంచ యుద్ధ చిహ్నాలు, క్లాక్‌ టవర్లు, నిజాం ప్యాలెస్‌లు ఈ నగరంలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ జ్ఞాపకాలు మన పూర్వీకుల కళా వైభవానికి ప్రతీకలు. ఇస్లామిక్‌ నిర్మాణశైలికి గోపురాన్ని పోలిన డోమ్‌లను (కుతుబ్‌షాహి టూంబ్స్‌) చేర్చింది హైదరాబాద్‌. మన తాతల ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి గోల్కొండ క్లాప్‌ ఏరియా (దర్వాజా దగ్గర నిలుచుని చప్పట్లు కొడితే అర కిలోమీటరు దూరంలోని దర్బార్‌ హాల్‌లో వినిపిస్తుంది) ఓ మచ్చుతునక. స్టకో కళతోనే సున్నంతో తలుపులు, తడికెలు చేసిన నిర్మాణ కళ (పాయిగా టూంబ్స్‌)కు చిరునామా హైదరాబాద్‌. చరిత్రలో రెసిడెన్షియల్‌ వైద్య కళాశాల నిర్వహించిన తొలి జ్ఞాపకం (యునాని వైద్య కళాశాల) మన హైదరాబాదే.

ఈ మహానగరమంటే ఎత్తయిన టవర్లే కాదు కళాత్మక నిర్మాణమున్న ప్యాలెస్‌లు, అద్భుతమైన కళాఖండాలు, చరిత్ర సంపదను దాచుకున్న మ్యూజియాల నగరం ఇది. ఒకే వ్యక్తి సేకరించిన అత్యధిక  కళాఖండాలు కొలువుదీరిన సాలార్‌జంగ్‌, అత్యధిక నాణాలు ప్రదర్శించే స్టేట్‌ ఆర్కియాలజీ మ్యూజియాలు ప్రపంచ విశేషాలెన్నిటినో చెబుతాయి. అంతరిక్ష ప్రయోగాలకు నాంది పలికిన నిజామియా అబ్జర్వేటరీ, అంతరిక్ష రహస్యాలను సామాన్యులకు చెప్పే బిర్లా ప్లానిటేరియం, ఆకాశవాణి, దూరదర్శన్‌, సైబర్‌ టవర్‌, సాంకేతిక విజ్ఞానంతో పురోగమిస్తున్నా నడిచొచ్చిన తొవ్వను గుర్తుచేసే శిల్పారామం, బ్రిటీష్‌ జ్ఞాపకాలుగా నిలిచే గోతిక్‌ నిర్మాణ చర్చ్​లు, అరబిక్‌ నిర్మాణ కళతో ఎత్తయిన మినార్లు, హిందూ మత విశ్వాసాలకు కేంద్రాలైన ఆలయాలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు, మంచినీటి సరస్సులు, భాగ్‌ నగర్‌ కీర్తిని కాపాడే ఉద్యాన వనాలు, ప్రగతి పరుగులో కొత్తగా అడుగులేస్తున్న మెట్రో రైల్‌ ఎన్నో ఉన్నాయిక్కడ. అవన్నీ చూసొద్దామిప్పుడు.