టీచర్లకు కూడా రానీకి అయితలేదు  

టీచర్లకు కూడా రానీకి అయితలేదు  
  • వానాకాలం సదువులు.. వర్షమొస్తే బడులు బంద్
  • పొంగుతున్న వాగులు..అధ్వానంగా రోడ్లు 
  • పోయే దారి లేక  ఊరు దాటని కాలేజీ పిల్లలు
  • ఈ ఏడాది ఇప్పటికే 20 రోజులకు పైగా మూత 
  • టీచర్లకు కూడా రానీకి అయితలేదు  

ఈ ఫొటోలో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వ్యక్తి ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ మండలంలోని జెండగూడ గ్రామ టీచర్ జితేందర్. ఇక్కడి మండల పరిషత్​ స్కూల్ లో 1 నుంచి 5వ తరగతి వరకు 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి జితేందర్​తో పాటు రవీందర్​ అనే మరో టీచర్​ పాఠాలు చెబుతారు. ప్రతి వర్షాకాలంలో వీరు ఈ ఊరికి రావాలంటే ప్రమాదకరంగా ఉన్న వాగు దాటాల్సిందే. గతేడాది ఇలాగే వాగు దాటుతుండగా వరద పెరిగి రవీందర్ చిక్కుకుపోగా స్థానికులు కాపాడారు. ఒకవేళ వాగు ఉధృతి ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకుని అధికారులకు పంపి సెలవు అడగాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా  వర్షాకాలంలో దాదాపు నెల పాటు బడి బంద్​ ఉంటోంది.  

ఆదిలాబాద్/ ఆసిఫాబాద్/ భద్రాచలం, వెలుగు : 

ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో  ఉన్న మారుమూల గ్రామాల్లో ఓ మోస్తరు వాన పడితే చాలు విద్యార్థులు ఇండ్లకే పరిమితమవుతున్నారు. వాగులు ఉప్పొంగి, రోడ్లు నాశనమై, కనీసం నడవడానికి కూడా వీలులేకుండా పోతున్నది. బస్సులు వచ్చేదారి లేక కాలేజీల్లో చదివే స్టూడెంట్స్​ కూడా ఊరు దాటడం లేదు. స్కూళ్లకు టీచర్లు వచ్చే వీలు లేక వానాకాలమంతా రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఆదిలాబాద్​ జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ పరిధిలోకి వచ్చే ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో దాదాపు 30 గిరిజన గ్రామాల్లో వర్షం పడితే బడులు బందవుతున్నాయి. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలకు 20 రోజులు స్కూళ్లు తెరుచుకోలేదు. ఉట్నూర్ మండలంలోని జెండాగూడ, నర్సాపూర్​ జే, శాంతాపూర్, పాత హీరాపూర్ ఎంపీపీఎస్, ధర్మాజీపేటల్లో దాదాపు 250 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇక్కడి నుంచి మరో 30 మంది స్కూల్, కాలేజ్ కోసం ఉట్నూర్, ఆదిలాబాద్ కు వెళ్తుంటారు. వర్షం పడినప్పుడుల్లా వాగులు పొంగడం..రోడ్లన్నీ బురదమయం అవుతుండడంతో విద్యార్థులు ఊరు దాటడం లేదు. అటు ఎంపీపీఎస్ స్కూల్స్​కు వచ్చే టీచర్లు కూడా రాలేక ఆగిపోతున్నారు. ఉట్నూర్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామాలకు సరైన రోడ్లు, వంతెనలు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. చెరువుగూడ, మొర్రిపేట, ఘన్​పూర్, నాగాపూర్, హీరాపూర్ జే, బలాన్పూర్, గంగాపూర్, సోనాపూర్, దంతనపల్లి, శివగూడ గ్రామాలన్నింటికి కలిపి ఆశ్రమ హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ, చిత్తబట్ట, జైత్రతాండ, గాదిగూడ మండలంలోని కునికాస, వర్కవాయి, కుండిదేవాపూర్, ఆదిలాబాద్ మండలంలోని మాలేగావ్​, అలికొరి, బుర్కి, బాబాపూర్, పూనగూడ ఏజెన్సీ గ్రామాల్లో కూడా వర్షాలు పడితే రాకపోకలు నిలిచిపోతున్నాయి.  

కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో...

 కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి ఒక వైపు వాగు, మరో రెండు వైపులా ప్రాణహిత నది ఉండగా ఇంకో దిక్కున దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఏ చిన్న వర్షం పడినా వాగు ఉప్పొంగి రాకపోకలు ఆగిపోతున్నాయి. ఈ ఊరిలో 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో 70 మంది వరకు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ కు వెళ్తుంటారు. మరో 80 మంది ఊరిలో ఉన్న రెండు సర్కారు బడుల్లో చదువుతున్నారు. వానొచ్చిన, వాగొచ్చినా స్టూడెంట్స్ చదువులు ఆగమవుతున్నాయి. టీచర్లు వాగు సమస్యతో రాలేకపోతున్నారు. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి ( గూడెన్ ఘాట్) వాగుపై లో లెవెల్ వంతెన ఉంది. ఆగస్టులో కురిసిన భారీ వర్షానికి వంతెన పై నుంచి నీళ్లు ప్రవహించడంతో తుంపెల్లి, చిర్రకంట ,వట్టివాగు కాలనీ ,ఉల్లిపిట్ట గ్రామాల స్టూడెంట్ల చదువులు బందయ్యాయి.  

మంచిర్యాల జిల్లాలో..

మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కల్లెంపల్లి మధ్య ఉన్న మత్తడి వాగు భారీ వర్షాలు పడినప్పుడల్లా ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఈ ఏడాది వర్షాలకు వాగుపైన నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వరదలు వచ్చినప్పుడు ముక్కిడిగూడెం, సుంపుటం, జాజులపేట, కల్లెంపల్లిలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ కారణంగా సదరు గ్రామాలకు చెందిన విద్యార్థుల చదువులు సాగడం లేదు. చాలా మంది ఇంటర్ కోసం బెల్లంపల్లికి వెళ్తుంటారు. వీరు కూడా వర్షాలకు ఇండ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే పడవలో ప్రయాణించాల్సి వస్తోంది.  

భద్రాద్రి జిల్లాలో... 

భద్రాచలంలో గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడల్లా పాఠశాలలు తెరవడం లేదు. మొన్నటి వానలకు 7 మండలాల్లోని 37 పాఠశాలు మునిగిపోయాయి. దీంతో జులై 11 నుంచి 17వ తేదీ బడులు బందయ్యాయి. 3వేల మంది స్టూడెంట్ల చదువు ఆగమైంది. ఈ నెలలో కూడా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టిలో 30 మంది ప్రైమరీ,హైస్కూల్​ స్టూడెంట్లు బడి మానేయాల్సి వచ్చింది. ఈ ఊరి నుంచి బైరాగుపాడు కు ప్రైమరీ స్కూల్​ స్టూడెంట్స్​ వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు నడవాలి. హైస్కూల్ ​స్డూటెంట్స్​బైరాగులపాడు చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసాపురం హైస్కూల్​కు వెళ్లాలి. గోదావరి పొంగితే ఊరు చివరన వాగులోకి నీరు వచ్చి ఎక్కడివాళ్లక్కడ నిలిచిపోవాల్సిందే. గత నెలలో వచ్చిన వరదలకు స్కూల్​బ్యాగులు, పుస్తకాలు  కొట్టుకుపోయాయి.