జనవరి లోపు స్కూళ్లు!

జనవరి లోపు స్కూళ్లు!

హైదరాబాద్, వెలుగు: కరోనా తీవ్రత తగ్గితే డిసెంబర్​లో 9, 10 తరగతులకు క్లాసులు ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే జనవరిలోనైనా బడులను స్టార్ట్ చేయాలని యోచిస్తోంది. కొంచెం అవకాశం ఉన్నా, పిల్లలను తిరిగి బడులకు రప్పించాలనే ఉద్దేశంలో ఉంది. తద్వారా బడికి దూరమయ్యామనే భావనను వారిలో పోగొట్టవచ్చని అభిప్రాయపడుతోంది. దీని వల్ల బడులకు రాకుండా ఉన్న గ్యాప్ తగ్గి, వచ్చే అకడమిక్ ఇయర్​లో ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొంటోంది. కరోనా కారణంగా మార్చి 16 నుంచి స్కూళ్లను బంజేశారు. దీంతో 58 లక్షల మంది స్టూడెంట్లు​బడులకు దూరమయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభించినప్పటికీ, పిల్లల్లో బడికి దూరమయ్యామనే బాధ కనిపిస్తోంది.

ఈ క్రమంలో ఈ ఏడాదిని జీరో ఇయర్ చేస్తారనే ప్రచారమూ సాగుతోంది. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు బడులను తప్పకుండా ఓపెన్ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. బడులతో పాటు హాస్టళ్లనూ ప్రారంభించాల్సి ఉండడంతో… వారం క్రితం అన్ని సంక్షేమ శాఖల అధికారులు, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డు ఆఫీసర్లతో స్పెషల్ సీఎస్ చిత్రారాంచంద్రన్ మీటింగ్ నిర్వహించారు. ఏటా 220 వర్కింగ్ డేస్ ఉండగా.. ఈసారి కనీసం 120  రోజులైనా బడులను నడిపించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో డిసెంబర్​లో 9,10 తరగతులతో పాటు ఇంటర్ క్లాసులనూ ప్రారంభించాలని అనుకున్నారు. అయితే దీపావళి తర్వాత మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనించి.. సీఎం అనుమతి ఇస్తే బడుల ప్రారంభంపై నిర్ణయం ప్రకటించాలని భావించారు. ఒకవేళ డిసెంబర్ లో సాధ్యం కాకుంటే, జనవరిలోనైనా స్కూళ్లు ఓపెన్ చేయాలని విద్యాశాఖ పట్టుదలతో ఉంది.

ఎగ్జామ్స్ లేకుంటే ప్రాజెక్టు మార్కులే కీలకం…

బడులు తెరిచిన తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు, ఎలా నిర్వహించాలనే దానిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సిలబస్​ను రెండు రకాలుగా విభజించి, ఆల్టర్నేటివ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇందులో 70శాతం సిలబస్ ను మాత్రమే ఫైనల్ ఎగ్జామ్స్​లో పరిగణనలోకి తీసుకోవాలని, మిగతా 30శాతంలో స్టూడెంట్స్ కు ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మెయిన్ సిలబస్ చెప్పడమే కష్టమని చాలామంది టీచర్లు అంటున్నారు. కానీ ఒకవేళ చివరి వరకూ బడులు ఓపెన్ చేయకుంటే, ఈ ప్రాజెక్టు వర్క్స్ మార్కులే కీలకంగా మారే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. “ ఫిజికల్ గా ఎగ్జామ్స్ పెట్టలేని పరిస్థితులు వస్తే, ప్రాజెక్టు వర్క్స్ మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఇవ్వాల్సి వస్తుంది” అని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.