ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు

ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు

ఒక వైపు కరోనా కేసుల వ్యాప్తి భారీగా పెరిగిపోతుంటే…మరోవైపు కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు పూర్తిగా ఫీజులు చెల్లించాలంటూ పేరెంట్స్ కు మొబైల్స్ లో మెసేజ్ లు పెడుతున్నారు. దీంతో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు విద్యా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజులు చెల్లించాలంటూ హిమాయత్ నగర్ లోని వాసవీ పబ్లిక్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు పేరెంట్స్. లాక్ డౌన్ తో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే… వేలల్లో ఫీజులు ఎలా చెల్లించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ… స్కూల్ యాజమాన్యం మాత్రం పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడేందుకు వస్తే… పోలీసులతో తమను అడ్డుకుంటున్నారని అన్నారు.  అంతేకాదు ఆన్ లైన్ క్లాసుల కారణంగా తమ పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఆన్ లైన్ క్లాసుల సమయాన్ని తగ్గించి… ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.