వేలల్లో ఫీజులు.. ఇరుకు గదుల్లో చదువులు

వేలల్లో ఫీజులు.. ఇరుకు గదుల్లో చదువులు

– కనిపించని ప్లే  గ్రౌండ్స్‌‌
– ప్రైవేట్‍ స్కూల్స్‌‌లో నో సేఫ్టీ
– విద్యాశాఖ నిర్లక్ష్యం.. పట్టించుకోని మేనేజ్‍మెంట్లు
– భయపడుతున్న తల్లిదండ్రులు
– ఇన్‌‌చార్జీలే నడిపిస్తున్నరు
– డీఈవో, డిప్యూటీ ఐఓఎస్‍ పోస్టులన్నీ ఖాళీ 
– ప్రభుత్వ విద్యపై కొరవడుతున్న పర్యవేక్షణ

క్షేత్ర స్థాయిలో పాఠశాల విద్యను పర్యవేక్షించాల్సిన అధికారుల పోస్టులన్నీ కొన్నేళ్లుగా ఖాళీగానే ఉండడంతో  సీనియర్‍ హెడ్‍ మాస్టర్లే  ఇన్‌‌చార్జీలుగా వ్యవహరిస్తున్నరు. హైదరాబాద్‌‌ జిల్లాలో 16 మండలా ల పరిధిలో డీఈవో, డిప్యూటీ ఐఓఎస్‍ పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ స్కూల్స్‌‌ సీనియర్‍ హెడ్‍ మాస్టర్లకు బాధ్యతలు అప్పగించారు.

ప్రభుత్వ గుర్తింపు ఉందని, భద్రత నియమాలు పాటించకుండా ప్రైవేట్‍, కార్పోరేట్‌  స్కూల్స్ మేనేజ్‍మెంట్లు విద్యార్థుల ప్రాణాలను గాలిలో దీపాల్లా మారుస్తున్నారు. ఇటీవల నాగోల్‍ సాయినగర్‍లో టెన్త్‌ విద్యార్థిని బిల్డింగ్‌ ఐదో అంతస్తు నుంచి పడి చనిపోవడం మరోసారి ప్రైవేట్‍ స్కూల్స్ భద్రతపై ప్రశ్న లేవనెత్తింది. ఇరుకైన గదులు, పై అంతస్తులోకి వెళ్లేందుకు ఇరుకైన మెట్లు, రెయిలింగ్ సరిగా లేకపోవడం లాంటివి స్కూల్‍ మేనేజ్‍మెంట్‍ నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నాయి. ఈ ఘటన కారణంగా స్కూల్‍ కెళ్లిన తమ పిల్లలు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదోననే ఆందోళనలో పేరెంట్స్ ఉంటున్నారు. జిల్లాలో సుమారు 2,200  ప్రైవేట్‍ స్కూల్స్ లో పిల్లల ప్రాణాలకు భరోసా కల్పించేలా సేఫ్టీ ప్రమాణాలు లేవనే విమర్శలు వస్తున్నాయి.

ప్రమాదం జరిగినప్పుడే హడావుడి
గతేడాది వివేకానందనగర్‌లోని ఓ స్కూల్‌లో షెడ్డు  కూలి ఇద్దరు విద్యార్థినులు మృతి చెందగా, మరో ఐదు మందికి  తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు స్కూల్‍ను సీజ్‌ చేశారు. కానీ అలాంటి పరిస్థితులున్న ఇతర స్కూల్స్ పై మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నారు.  హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 2,893 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‍ స్కూల్స్ ఉండగా, దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వేలల్లో ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‍ స్కూల్స్ చాలా  బ్రాంచ్‌ల్లో క్వాలిటీ లేని సేఫ్టీ పరికరాలు పెట్టుకోగా, అత్యవసర టైంలో వాటిని ఎలా వాడాలో సిబ్బందికి తెలియడం లేదు. గతేడాది ఫైర్‍ సేఫ్టీ పరికరాలు లేవని చాలా స్కూళ్లకు రెన్యూవల్ ఇవ్వలేదు. అయినా అవి అడ్మిషన్లను తీసుకున్నాయి.  తాజాగా ప్రభుత్వం స్కూల్స్ ఫైర్‍ సేఫ్టీలో మినహాయింపులు ఇవ్వడంపై విమర్శలకు అవకాశం ఉంది.  సిటీలో  దాదాపు 90 శాతం స్కూల్స్ లో  భద్రత చర్యలు లేవని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. 95 శాతం కార్పొరేట్‌ స్కూల్స్ లో  ఫైర్‌సేఫ్టీ పరికరాలపై నైపుణ్యమున్న సిబ్బంది లేరు. స్కూల్స్ లో తనిఖీలు చేసేందుకు పోతే ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వస్తాయని, అన్ని బాగున్నాయని చెప్పాలంటూ ఒత్తిడి చేస్తారని, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కువని ఓ విద్యాశాఖాధికారి చెప్పడం చూస్తే  పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.

క్షేత్రస్థాయిలో కనిపించని తనిఖీలు
అపార్ట్ మెంట్లు, కమర్షియల్‌ బిల్డింగ్స్‌లోనూ  ప్రైవేట్‍ స్కూల్స్ నడుస్తుండగా, జిల్లాలో సుమారు 2,200 వరకు ఇలాంటివే కనిపిస్తాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా మామూలు తీసుకుంటూ ఆఫీస్‍లో కూర్చొనే  అనుమతులు జారీ చేస్తున్నారు. నామ్‍కేవాస్తేగా తనిఖీలు చేసి అన్ని బాగున్నాయని సర్టిఫైడ్‍ చేస్తూ పర్మిషన్‌ ఇస్తుంటారు. విద్యావేత్తలు, సామాజిక వేత్తలతోపాటు ప్రైవేట్‍ స్కూల్స్ పై పేరెంట్స్ ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అధికారులు హడావుడిగా నోటీసులు జారీ చేసి, అప్పటికి సమస్యను సద్దుమణిగేలా చూస్తున్నారు. ఆ తర్వాత స్కూల్స్‌పై అధికారులు దృష్టి పెట్టరు. స్కూల్స్ మేనేజ్‍మెంట్ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడి చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటుండడమే దీనికంతటికి కారణమని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

ఇవి భద్రతా నిబంధనలు

స్కూల్‍ ఓపెన్‌ చేసేవారు మొదటగా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.  ఫైర్‍ సేఫ్టీకి సంబంధించి  ఎన్‍ఓసీ పత్రాలను అందజేస్తారు. దాని ఆధారంగా డీఈవోలు స్కూళ్లకు గుర్తింపు మంజూరు చేస్తారు.

బిల్డింగ్‍లో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆర్పేందుకు వీలుగా అక్కడక్కడ ఫైర్‌ అలారం వాల్వ్‌లతోపాటు ఆటోమెటిక్‌గా నీటిని జల్లే స్పింక్లర్లు ఏర్పాటు చేయాలి.

బిల్డింగ్‍ కింది భాగంలో కనీసం ఐదు వేల లీటర్లు నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగిన సంప్‌/సెప్టిక్‍ ట్యాంకు నిర్మించాలి.

నీటిని భవనంలోకి పైపుల ద్వారా పంపేలా ఒక మోటారును, ఒకవేళ విద్యుత్‌ సరఫరా లేనప్పుడు ప్రమాదం జరిగినా నీటిని పంపింగ్‌ చేసేలా జనరేటర్‌ అందుబాటులో ఉంచాలి.

అగ్నిప్రమాదం జరిగినప్పుడు  ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది బిల్డింగ్‍ చుట్టూ ఈజీగా తిరిగేలా మూడు మీటర్ల  సెట్‌బ్యాక్‌ ఉండాలి.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించి వాటి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

ఏటా అగ్నిమాపకశాఖతో  చెక్‌ చేయించుకొని లైసెన్సుని రెన్యూవల్‌ చేసుకోవాలి. ఎన్‌ఓసీ ఆధారంగా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అనుమతి జారీ చేస్తారు.