
తెలంగాణ ప్రజాపాలనలో అట్టడుగు వర్గాలను కాంట్రాక్టర్లను చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ధర్మారంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్.. ఆదిలాబాద్ మంత్రి గా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధి కి పాటుపడుతామని.. సీఎంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దళిత గిరిజనులకు మూడు కోట్ల వరకు కాంట్రాక్టులు ఇస్తామని హామీ ఇచ్చారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వలన రిజర్వు బ్యాంకు ఏర్పడిందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. నాయకులు ఎప్పుడూ పేదల వైపు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. కుల వివక్ష పోవాలంటే అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బాబసాహెబ్ అంబేద్కర్ వల్ల తెలంగాణ రాష్ట్రము ఏర్పడిందని తెలిపారు.
ధర్మారం స్కూల్ లో ఫర్నిచర్ పంపిణీ ప్రారంభించామని మంత్రి వివేక్ తెలిపారు. ఇప్పటి వరకు రెండు వేల పాఠశాలల కు ఫర్నిచర్ పంపిణీ చేశామని.. కానీ చేసింది చెప్పుకోవడం ఇష్టం ఉండదని ఈ సందర్భంగా అన్నారు. తాను ఎప్పటికీ సింపుల్ గానే ఉంటానని.. తమ తండ్రి మంత్రి గా ఉన్నా అప్పట్లో ఎక్కడా చెప్పుకోలేదని చెప్పారు.
తన తండ్రి కాకా గడ్డం వెంకటస్వామి మంత్రిగా ఉన్న సమయంలో.. పనుల కోసం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఏడు గంటలు నిరీక్షించినట్లు తెలిపారు. అప్పట్లో తమ తండ్రి కేంద్ర మంత్రని చెప్పుకోలేదని అన్నారు. సింపుల్ గా ఉండమని తమ తండ్రి చెప్పేవారనీ..ఇప్పటికీ ఆయన మాటలను, సూచనలను పాటిస్తూనే ఉంటానని ఈ సందర్భంగా మంత్రి వివేక్ చెప్పారు.