స్కూల్స్ రీ ఓపెన్..తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివే..!

స్కూల్స్ రీ ఓపెన్..తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివే..!

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కరోనా క్ర‌మంలో మూసివేసిన విద్యాసంస్థలు రీ ఓపెన్ అంశంపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్రగతి భవన్ లో సోమ‌వారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. అలాగే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై కూడా చ‌ర్చించారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30 లోగా శానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

అన్ని పాఠశాలలు శానిటైజేషన్ చేయాలి:

జిల్లా పరిషత్ చైర్మన్లు వారి వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి వారి మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు శానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా ఉన్నాయో.. లేవో పరిశీలించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాల డిపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డిపీవోలు, ఎంపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్దారించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 30 తేదీలోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

విద్యార్థుల పట్ల జాగ్రత్తలు :
విద్యాసంస్థలు తెరిచిన తర్వాత స్కూళ్ల‌ల్లోని విద్యార్థినీ విద్యార్థులకు జ్వర సూచన వుంటే ఆయా స్కూళ్ల‌ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే అతి సమీపంలోని పిహెచ్ సీ కి తీసుకువెళ్లి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని సీఎం తెలిపారు. ఒక‌వేళ‌ కోవిడ్ నిర్దారణ అయితే సదరు విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు  శానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణా చర్యలను విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, తదితర కోవిడ్ నియంత్రణ విధానాలను పాటించేలా చూసుకోవాలని, తమ పిల్లలను విద్యాసంస్థలకు పంపుతున్న తల్లిదండ్రులను సిఎం కేసిఆర్ కోరారు.