ఎవరెస్ట్‌ బాల్కనీలో వెదర్ స్టేషన్

ఎవరెస్ట్‌ బాల్కనీలో వెదర్ స్టేషన్
  • ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ
  • బేస్ క్యాంప్ 1, 2లు సహా మొత్తం ఐదు ఏర్పాటు

కాఠ్మండు: ఎవరెస్ట్​.. చాలా మంది పర్వతారోహకులకు అదో గమ్యం. అది ఎక్కేస్తే చాలనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ, కొద్ది రోజుల కింద మంచు కొండపై పరిస్థితేంటో తెలిసిందే. ట్రాఫిక్​ పెరిగి ఇండియన్లు సహా పదుల సంఖ్యలో అక్కడ ఇరుక్కుపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటు ఎటూ తెలియని వాతావరణ పరిస్థితులూ వారి ప్రాణాలను బలిగొన్నాయి. ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా  ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఎవరెస్ట్​ అంచుపైన ఓ ఆటోమేటెడ్‌ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది నేషనల్​ జియోగ్రఫిక్​ సొసైటీ (ఎన్​జీఎస్​). దాంతో పాటు మరో నాలుగు కేంద్రాలనూ పెట్టింది. రీసెర్చర్లు, క్లైంబర్లు, ప్రజలకు ఎవరెస్ట్​ శిఖరంపైన వాతావరణ పరిస్థితులేంటో తెలియజేసేందుకు ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్​జీఎస్​గురువారం ప్రకటించింది.

‘‘వివిధ విభాగాలకు చెందిన సైంటిస్టులు, వాతావరణ నిపుణులు ఎవరెస్ట్​పై ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఎవరెస్ట్​కు బాల్కనీగా పిలిచే ప్రాంతంలో 8,430 మీటర్ల ఎత్తులో ఒక కేంద్రాన్ని పెట్టాం. రెండోది 7,945 మీటర్ల ఎత్తులో దక్షిణాన నెలకొల్పాం” అని ఎన్​జీఎస్​ మార్కెటింగ్​ అండ్​ కమ్యూనికేషన్​ డైరెక్టర్​ ఫే జెంక్స్​ చెప్పారు. మరో మూడింటిని ఫోర్ట్సే (3,810 మీటర్లు), బేస్​ క్యాంప్​ (5,315 మీటర్లు), బేస్​క్యాంప్​2 (6,464 మీటర్లు) వద్ద ఏర్పాటు చేసినట్టు వివరించారు. అన్ని కేంద్రాలు ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు, తేమ, పీడనం, గాలి వేగం, గాలి దిశ తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయని చెప్పారు. రోలెక్స్​ పర్పెచువల్​ ఎక్స్​ట్రీమ్​ ఎక్స్​పెడిషన్​ టు ఎవరెస్ట్​ సహకారంతో వీటిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటి వల్ల ఆ ప్రాంతంలోని వందల కోట్ల మందికి మేలు కలుగుతుందన్నారు.

ఏప్రిల్​, జూన్​  మధ్య నేట్​జియో సొసైటీ, త్రిభువన్​ యూనివర్సిటీ, రోలెక్స్​ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైంటిస్టులు, క్లైంబర్లు ఎవరెస్ట్​పై సైంటిఫిక్​ ప్రయోగాలు చేపట్టారన్నారు. చరిత్రలో చేసిన ఒకే ఒక్క సైంటిఫిక్​ ఎక్స్​పెడిషన్​ ఇదేనని భావిస్తున్నారు. అంతేగాకుండా ఆ టీం ఎత్తైన ప్రాంతంలోని (8,020 మీటర్లు) ఐస్​ కోర్​ను తీసుకొచ్చారు. అది కూడా మొదటి సారేనని భావిస్తున్నారు