
- వయసును వెనక్కి మళ్లించే పనిలో సైంటిస్టులు
- ఎలుకలపై ‘రివర్స్ ఏజింగ్’ రీసెర్చ్ సక్సెస్
- కొన్నివారాల్లోనే యంగ్‌గా మారిన ముసలి ఎలుకలు
- వాటి కిడ్నీ, కండరాలు, కంటి రెటీనా కణాలకు ఫ్రెష్ఎనర్జీ
ముసలోళ్లను యూత్‌ఫుల్‌గా చేసే టెక్నాలజీ వస్తే.. ! 60 ఏండ్ల వాళ్లకు 20 ఏండ్ల లుక్ వస్తే..!ఇది ఊహ కాదు.. కల అంతకన్నా కాదు.దీన్ని నిజం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ లో ఉన్న హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన సింక్లయర్ ల్యాబ్ సైంటిస్టులు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వైపుగా తొలి విజయం సాధించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. వాటిలో ‘రివర్స్ ఏజింగ్’ చేయగలిగామని ప్రకటించారు. ‘ఎపి జెనెటిక్స్’ ద్వారా ముసలి ఎలుకలను మళ్లీ యవ్వనంలోకి తీసుకు రాగలిగామని సైంటిస్టులు వెల్లడించారు. దీనిపై అమెరికాకు చెందిన ప్రముఖ మెడికల్ జర్నల్ ‘సెల్’లో ఇటీవల రీసెర్చ్ రిపోర్ట్ పబ్లిష్ అయింది.
వయసును వెనక్కి మళ్లించే టార్గెట్‌తో నిర్వహించిన ఈ స్పెషల్ రీసెర్చ్‌ను కొన్ని నెలల తరబడి ఎలుకలపై నిర్వహించారు. సింక్లయర్ ల్యాబ్ కు చెందిన జెనెటిక్ ఇంజినీరింగ్ నిపుణుల టీమ్ ఇందుకోసం శ్రమించింది. గతంలో ఈ తరహాలో జరిగిన ప్రయోగాల సమాచారాన్ని కూడగట్టి, ఈసారి పకడ్బందీగా ప్రయోగాన్ని ప్లాన్ చేశారు. సరిగ్గా పదేండ్ల కింద నోబెల్ ప్రైజ్నుగెల్చుకున్న ‘ఓఎస్‌కే’ జీన్స్ ఫార్ములాతో కాక్టెయిల్ను రెడీ చేసుకొని రీసెర్చ్‌ను స్టార్ట్ చేశారు. రీసెర్చ్‌లో భాగంగా జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా ఎలుకల డీఎన్ఏ కోడింగ్ లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా వాటికి ఒక ఔషధాన్ని అందించి.. డీఎన్ఏ లో 20 చోట్ల ఎంజైమ్స్ యాక్టివిటీని మార్చారు. అనంతరం డీఎన్ఏ లోకి మిథైల్ మాలిక్యూల్స్ గ్రూప్ ను యాడ్ చేశారు. దీనికి కొనసాగింపుగా ఎలుకలోని డీఎన్ఏ లో ‘జీన్ ఎక్స్ ప్రెషన్’ ప్రక్రియ జరిగింది. జీన్ ఎక్స్ ప్రెషన్ అనేది నాలుగు దశల్లో జరుగుతుంది. ఇందులో మొదటి దశనే ‘ఎపిజెనెటిక్’ అంటారు. ఈ ఎపి జెనెటిక్ ప్రక్రియనే హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు వాడుకొని.. ముసలి ఎలుకలను మళ్లీ యవ్వనంలోకి తీసుకొచ్చారు. మనం డీఎన్ఏలో ఏదైనా జన్యుమార్పు (జెనెటిక్ చేంజ్) చేస్తే దాన్ని రివర్స్ చేయలేం. కానీ ‘ఎపిజెనెటిక్ చేంజ్’ చేస్తే.. దాన్నిరివర్స్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఫ్యూచర్ లో మనుషుల్లో రివర్స్ఏజింగ్ ను సాధించేందుకు ఇదే అత్యంత సానుకూల అంశంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొన్నివారాల్లోనే.. ఓల్డ్ ఏజ్ టు యంగ్ఏజ్
‘జీన్ ఎక్స్ ప్రెషన్’ ప్రక్రియ ముగిసిన కొన్ని వారాలకే ల్యాబ్ లోని ఎలుకలు ముసలి వాటిలా మారిపోయాయి. వాటి ఆరోగ్యం సన్నగిల్లింది. ఆ ఎలుకల్లో కణాలు వీక్ గా మారాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు వీటిలో కొన్ని ఎలుకలను వేరుచేసి జీన్ థెరపీ చేశారు. వాటి శరీరంలోకి ‘ఓఎస్ కే’ జీన్స్ కాక్ టెయిల్, అడినో అసోసియేటెడ్ వైరస్ (ఏఏవీ) వెక్టర్లను ఇంజెక్ట్ చేశారు. కొన్ని వారాల తర్వాత ఆశ్చర్యకరమైన ఫలితం వచ్చింది. ఆ ఎలుకల కండరాలు స్ట్రాంగ్ అయ్యాయి. కిడ్నీ, కంటి రెటీనా కణాలు యవ్వన శక్తిని మళ్లీ పొందాయి. మిగతా శరీర అవయవాలు పునరుత్తేజం పొందాయి. ఆ ముసలి ఎలుకలు యంగ్ గా మారిపోయి ల్యాబ్ లో పరుగులు తీశాయి. ఇదే ఫార్ములాను భవిష్యత్తులో మనుషులకూ అప్లై చేస్తే.. ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై చర్చ జరుగుతోంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ ప్రయోగాన్ని ఇంకొన్ని దశల్లో జరిపిన తర్వాతే మనుషులపై ట్రయల్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘ఓఎస్ కే’ కాక్ టెయిల్కీలకం.. అదేంటి ?
ముసలి ఎలుకలను యంగ్ గా మార్చేందుకు ఇచ్చిన ‘ఓఎస్‌కే’ జీన్స్ కాక్టెయిల్లోనే అసలు మ్యాజిక్ అంతా దాగి ఉంది. ‘ఓ ఎస్కే’లో.. ఓ అంటే ‘ఓసీటీ4’, ఎస్ అంటే ‘ఎస్ఓఎక్స్2’, కె అంటే ‘కేఎల్ఎఫ్4’ అని అర్ధం. ఇవి మూడు కూడా ట్రాన్ స్క్రిప్షన్ ఫ్యాక్టర్ జీన్స్. వాస్తవానికి ఓఎస్‌కే జీన్స్ మనిషి పుట్టుకకు మూలమైన స్టెమ్ సెల్స్‌లో యాక్టివ్‌గా ఉంటాయి. వీటిలో ఎంతటి శక్తి దాగి ఉంటుందంటే.. ముసలివిగా మారిపోయిన శరీర కణాలను కూడా మళ్లీ యవ్వనంలోకి తీసుకురాగలవు. అందుకే ఎలుకల్లో రివర్స్ ఏజింగ్ కోసం సైంటిస్టులు ‘ఓఎస్‌కే’ కాక్ టెయిల్‌ను వాడారు. మన చర్మంలో వివిధ పొరలు ఒకదాని కింద మరొకటిగా ఉంటాయి. వీటిలో అన్నింటి కంటే పైన ఉండేదాన్ని‘ఎపి డెర్మిస్’ లేయర్అంటారు. ఇందులో కెరాటినోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి చర్మానికి గాయమైతే రిపేర్ చేసి, పూర్వస్థితి వచ్చేలా చేస్తాయి. ఓఎస్‌కే కాక్ టెయిల్ ముసలి ఎలుకల శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. వాటి చర్మంలోని కెరాటినోసైట్స్ సహకరించాయని గుర్తించారు. ఎలుకలను యంగ్ గా మార్చేందుకు ఉపయోగపడే ‘ఎపిజెనెటిక్ మార్కర్స్’ను గుర్తించేలా ఓఎస్ కే కాక్ టెయిల్‌కు కెరాటినో సైట్స్ గైడ్ చేశాయని నిర్ధారించారు. ఈ ప్రక్రియ వల్లే ముసలి ఎలుకలు యంగ్‌గా మారాయని చెప్పారు.
ఓఎస్‌కే ఫార్ములాకు పదేళ్ల కిందే ‘నోబెల్’..
ఓఎస్‌కే కాక్ టెయిల్‌ను తయారు చేసినందుకు 2012లో జపాన్‌కు చెందిన బయాలజిస్ట్ షిన్యా యమనక కు నోబెల్ బహుమతి లభించింది. ముదిరిపోయిన శరీర కణాలను మళ్లీ స్టెమ్స్ సెల్స్ స్థితికి మార్చే మ్యాజిక్ ఫార్ములా ‘ఓఎస్‌కే’ను తయారు చేసినందుకు ఆయనకు అప్పట్లో నోబెల్ ప్రకటించారు.