
- తొలిసారిగా ల్యాబ్లో మానవ దంతాలను పెంచిన సైంటిస్టులు
- దంతాలు ఊడినా.. భవిష్యత్తులో కొత్తవి పెంచుకునేందుకు చాన్స్
లండన్: ఎలుకలు, బల్లులు, ఏనుగులు, మొసళ్ల వంటి జంతువులకు, షార్క్ వంటి చేపలకు ఊడిపోయిన కొద్దీ దంతాలు మళ్లీ మళ్లీ కొత్తగా పుడుతూనే ఉంటాయట. మనకు మాత్రం చిన్నప్పుడు పాల దంతాలు వచ్చి ఊడిపోతాయి. టీనేజ్ లోకి రావడానికి ముందు అవి పోయి శాశ్వత దందతాలు వస్తయి. ఒకవేళ పుచ్చుపట్టిపోయి లేదంటే దెబ్బలు తగిలి ఈ శాశ్వత దంతాలు రాలాయంటే ఇక అంతే సంగతులు.
జీవితాంతం తొర్రిగా ఉండాల్సిందే.. లేదంటే సర్జరీ చేయించుకుని ఇంప్లాంట్లు పెట్టించుకోవాల్సిందే. కానీ భవిష్యత్తులో ఇక మనుషులకు కూడా నోట్లోనే కొత్త దంతాలను పుట్టించవచ్చంటున్నారు లండన్ లోని కింగ్స్ కాలేజ్, ఇంపీరియల్ కాలేజ్ సైంటిస్టులు! అవును. ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్ లో మానవ దంతాలను సక్సెస్ ఫుల్ గా పెంచగలిగామని వారు ప్రకటించారు. భవిష్యత్తులో ఎవరికి కావాల్సిన దంతాలను వారి దంత కణాలతోనే ల్యాబ్ లో పెంచి నోట్లో పెట్టేయొచ్చని.. లేదంటే నోట్లో తొర్రి పడ్డచోటే కొత్త దంతాలను సహజంగా పెరిగేలా చేయొచ్చని వారు అంటున్నారు.
ఇదే అసలు సవాల్..
మన నోట్లో సహజంగా పుట్టి పెరిగే దంతాల మాదిరిగానే.. ఇవి కూడా దవడల లోతుల్లో నుంచి పుట్టి సహజంగానే పెరుగుతాయని సైంటిస్టులు చెప్తున్నారు. నేచురల్ టీత్ మాదిరిగానే ఇవి కూడా దీర్ఘకాలంపాటు దృఢంగా ఉంటాయని అంటున్నారు.
సొంత దంత కణాలతోనే పెరుగుతాయి కాబట్టి.. వీటిని సంబంధిత వ్యక్తుల శరీరం తిరస్కరించే ప్రమాదం కూడా ఉండదని పేర్కొంటున్నారు. అయితే, ల్యాబ్ లో మానవ దంతాలను పెరిగేలా చేసినప్పటికీ, వెంటనే ఇక మనుషులకు ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టేందుకు వీలుకాదని.. అసలు సవాలు ఇప్పుడే మొదలైందని చెప్తున్నారు.
దంతాలను పూర్తిగా ల్యాబ్ లోనే పెంచి, ఆ తర్వాత మనుషుల నోట్లోకి ట్రాన్స్ ప్లాంట్ చేయాలా? లేదంటే మనుషుల నోట్లోనే పుట్టించి, పెరిగేలా చేయాలా? ఈ రెండింటిలో ఏ పద్ధతి బెటర్? అనే ప్రశ్నలు ప్రస్తుతం తమ ముందు ఉన్నాయని సైంటిస్టులు వెల్లడించారు. అయితే, వీటిలో ఏ పద్ధతిని అందుబాటులోకి తీసుకురావాలన్నా కొన్ని ఏండ్ల సమయం మాత్రం పడుతుందని చెప్తున్నారు.
ఇలా పెంచారు..
సాధారణంగా మన నోట్లోని దవడల్లో దంతాలు పెరిగేందుకు ముందు దంతకణాలు ఏర్పడతాయి. అవన్నీ కలిసి ఒకదానికొకటి సిగ్నల్స్ ఇచ్చుకుంటూ కలిసికట్టుగా దంతాలుగా మారతాయట. సరిగ్గా ల్యాబ్ లోనూ అలాగే దంతాలు పెరిగేలా చేయగలిగారు సైంటిస్టులు. ఇందుకోసం వారు మనుషుల దవడల్లోని పరిస్థితులను పోలి ఉండేలా ప్రత్యేకమైన బయోమెటీరియల్ ను, దంతకణాలు పెరిగేందుకు కావలిసిన పోషక పదార్థాలను తయారు చేశారు.
తర్వాత పెట్రిడిష్ లో బయోమెటీరియల్ కు దంతకణాలను యాడ్ చేసి, పోషక పదార్థాలను అందించారు. దీంతో ఆ కణాలు ఒకదానికి ఒకటి సిగ్నల్స్ ఇచ్చుకుని, కలిసికట్టుగా చిన్న చిన్న దంతాలుగా పెరిగాయి. దీంతో తొలిసారిగా ల్యాబ్ లో మనుషుల దంతాలను పెంచి సైంటిస్టులు డెంటల్ సైన్స్ లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.