శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ పెరగడంతో తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 13 నుంచి తెలంగాణ నుంచి పది ప్రత్యేక రైళ్లను శబరిమలకు వెళ్లే భక్తుల కోసం నడపనున్నట్లు రైల్వే తెలిపింది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కొల్లాంకు వెళ్లే స్పెషల్ ట్రైన్ (నెం.07117) రైలు డిసెంబర్ 13న బయల్దేరుతుంది. బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తిరుపతి స్టేషన్ల మీదుగా కొల్లాంకు చేరుతుంది.
పైన పేర్కొన్న రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. చర్లపల్లి నుంచి కూడా కొల్లాంకు రెండు ప్రత్యేక రైళ్లు (ట్రైన్ నంబర్.07119, ట్రైన్ నెంబర్.07121) నడవనున్నాయి. డిసెంబర్ 17, 20, 31 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి స్టేషన్ నుంచి బయల్దేరి సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్ పల్లి, వికారాబాద్, తాండూర్, గుంతకల్, చిత్తూరు, కాట్పాడి మీదుగా కొల్లాం వెళతాయి. హజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి కొల్లాంకు స్పెషల్ ట్రైన్ (నెంబర్.07123) నడవనుంది. నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తిరుపతి, కొట్టాయం మీదుగా కొల్లాం వెళుతుంది.
కొల్లాం నుంచి తిరుగు ప్రయాణం కోసం కూడా అయ్యప్ప భక్తుల కోసం రైళ్లు నడవనున్నాయి. డిసెంబర్ 15, 19, 22, 26, జనవరి 2వ తేదీల్లో కొల్లాం నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవాళ ( డిసెంబర్ 3న) ఈ ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఓపెన్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
