యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో.. రూ.6 కోట్ల విలువైన స్క్రాప్ మాయం?

యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో..  రూ.6 కోట్ల విలువైన స్క్రాప్ మాయం?
  • యాదాద్రి థర్మల్  విద్యుత్  పవర్ ప్లాంట్  నుంచి గుట్టుగా రవాణా 
  •  ప్లాంట్  సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మేనేజ్
  • విచారణను వేగవంతం చేసిన పోలీసులు

 
మిర్యాలగూడ, వెలుగు: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్  విద్యుత్  పవర్ ప్లాంట్ లో (ఇనుము, అల్యూమినియం, ఇతర స్క్రాప్) గోడౌన్ ఇన్ చార్జ్ గా ఉన్న ఓ గెజిటెడ్  అధికారి సహకారంతో రూ.6 కోట్ల విలువైన స్క్రాప్  అక్రమ మార్గంలో మాయమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ  స్క్రాప్  అక్రమ దందాలో భాగంగా మొదట టాటా ఏస్  వెహికిల్ ను అద్దెకు తెచ్చి అక్రమ రవాణా చేసిన ఓ వ్యక్తి.. అనంతరం కొద్ది నెలలకే లారీ కొనుగోలు చేసి అడ్డదారిలో స్క్రాప్  తరలించాడని సమాచారం. ముఠా సభ్యుల్లో కొంత మంది వెహికల్స్, ప్లాట్లు కొనుగోలు చేశారని ప్రచారం సాగుతోంది. 

సుమారు నాలుగు రోజుల క్రితం పోలీసులకు చిక్కిన ఈ ముఠా సభ్యులు భారీగా స్క్రాప్ ను అక్రమ మార్గంలో తరలించి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్లాంట్ లో ప్రవేశించేందుకు ప్లాంట్  సెక్యూరిటీ గార్డులకు ముఠా సభ్యులు రూ.1000 నుంచి రూ.2 వేలు ఇచ్చి మేనేజ్  చేసి దందాను జోరుగా కొనసాగించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన వెంటనే ఒక్కో ముఠా సభ్యుడు రూ.1.50  లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పోలీసులకు లంచం ఇచ్చి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. అక్రమార్కుల గుట్టును బయటకు తీసేందుకు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఇనుము షాపు వ్యాపారి ఈ ప్లాంట్  స్క్రాప్  చోరీ  దందాలో కీలకంగా ఉన్నట్లు సమాచారం.