మసులుతున్న సైబీరియా సంద్రం

మసులుతున్న సైబీరియా సంద్రం

సముద్రం లోపలి నుంచి విడుదలవుతున్న మీథేన్​ గ్యాస్​
ప్రపంచ సగటు కన్నా 9 రెట్లు ఎక్కువంటున్న సైంటిస్టులు
80 మంది సైంటిస్టుల రీసెర్చ్​
సముద్రం అడుగునా పెర్మాఫ్రోస్ట్లు

సైబీరియా సముద్రం అడుగున పెర్మాఫ్రోస్ట్​లున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఉత్తర నార్వే, రష్యాల్లోని బారెంట్స్​ సముద్రం అడుగు భాగంలో వందల కొద్దీ పెద్ద పెద్ద గోతులను 2017లో సైంటిస్టులు గుర్తించారు. మీథేన్​ వాయువు భారీగా విడుదలయ్యే టైంలో పేలి ఈ గోతులు ఏర్పడ్డాయని నిర్ధారించారు. బెనెట్​ ఐల్యాండ్​ చుట్టుపక్కల ఉన్న సముద్రాల నీళ్లు, అక్కడి పూడికలను తీసుకుని కారణాలను అంచనా వేస్తున్నారు. ఒక ప్రాంతంలోనైతే ఊహించిన దాని కన్నా ఎక్కువ మీథేన్​ ఉన్నట్టు తేల్చారు.

సైబీరియా సంద్రం మసిలిపోతోంది. మీథేన్​ బుడగలను వెదజల్లుతూ మరిగిపోతోంది. తూర్పు ఆర్కిటిక్​ పెర్మాఫ్రోస్ట్​ (శాశ్వతంగా మంచు ఉండే ప్రాంతం) తరిగిపోతుండడం వల్ల సైబీరియాపై పడుతున్న ప్రభావాలను తెలుసుకునేందుకు వెళ్లిన 80 మంది సైంటిస్టులు ఈ షాకింగ్​ విషయాన్ని గుర్తించారు. సముద్రం అడుగు భాగం నుంచి మీథేన్​ బుడగలు వస్తుండడం వల్లే ఇలా సముద్రం వేడెక్కుతోందని చెబుతున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే తూర్పు సైబీరియా సముద్రంలో మీథేన్​ పరిమాణం ఆరు నుంచి ఏడు రెట్లు ఎక్కువగా ఉందని అంటున్నారు. ‘‘నేను ఇప్పటిదాకా చూసిన అత్యంత శక్తిమంతమైన గ్యాస్​ ఫౌంటెయిన్​ ఇదే” అని సైంటిస్టుల బృందానికి నేతృత్వం వహించిన రష్యాలోని టామ్స్​ పాలిటెక్నిక్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ ఇగోర్​ సెమిలెటోర్​ చెప్పారు. ఇప్పటిదాకా ఇంత శక్తిమంతమైన మీథేన్​ గ్యాస్​ బుడగలను చూడలేదన్నారు. దాదాపు ఐదు చదరపు మీటర్ల వైశాల్యంలో సముద్రం నుంచి మీథేన్​ బుడగలు విడుదలవుతున్నాయని చెప్పారు. ఆ ప్రాంతం నుంచి సైంటిస్టులు శాంపిళ్లను సేకరించారు. ఆ బుడగలు వస్తున్న ప్రాంతంలో విడుదలవుతున్న మీథేన్​, ప్రపంచ సగటుకు ఏడు రెట్లు ఎక్కువని అంటున్నా కొందరు మాత్రం 9 రెట్లు ఎక్కువని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ టెంపరేచర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

పెర్మాఫ్రోస్ట్​ బద్దలై..

కొన్ని వేల ఏళ్ల క్రితం ఐస్​తో నిండిన ప్రాంతమే పెర్మాఫ్రోస్ట్​. నేషనల్​ స్నో అండ్​ ఐస్​ డేటా సెంటర్​ ప్రకారం ఉత్తరార్ధగోళంలో 1.4 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర పెర్మాఫ్రోస్ట్​ విస్తరించి ఉంది. ఆ పెర్మాఫ్రోస్ట్​ లోపల మొత్తం కర్బన సమ్మేళనాలు (ఆర్గానిక్​ మూలకాలు) నిండి ఉన్నాయి. ఇప్పుడు ఆ పెర్మాఫ్రోస్ట్​ కొన్ని చోట్ల బద్దలవుతుండడంతో మీథేన్​ వాయువు బయటకు విడుదలవుతోంది. కార్బన్​ డయాక్సైడ్​తో పోలిస్తే మీథేన్​ వాయువులు చాలా శక్తిమంతమైనవి. అందుకే ఇప్పుడు సైబీరియా ప్రాంతంలో వేడి ఎక్కువగా నమోదవుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ పెర్మాఫ్రోస్ట్​లు బద్దలవడం మరింత ఎక్కువైతే మీథేన్​ వాయువులు మరింత ఎక్కువగా విడుదలవుతాయని, టెంపరేచర్లు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబీరియాలో ఒకప్పుడు ఎక్కువగా ఉన్న పెర్మాఫ్రోస్ట్​లు ఇటీవలి కాలంలో కరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. 2016లో కొన్ని ప్రాంతాల్లో జెల్​ లాగా అక్కడి ప్రాంతం మారిపోవడాన్ని సైంటిస్టులు గుర్తించారు.