కనబడకుండా పోయిన ఇండియన్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆంటొనోవ్ ఏఎన్ -32 కోసం సెర్చ్ ఆపరేషన్ వేగవంతమైంది. విమానం ఆచూకీ తెలుసుకోడానికి ఇస్రో రంగంలోకి దిగింది. రీశాట్ సిరీస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్లతో జాడ కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సుఖోయ్ షూ-30 యుద్ధ విమానాలు, సీ-130 హెర్క్యులెస్ స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, మిగ్ 17 చాపర్లతో అధికారులు గాలిస్తున్నారు. తాజాగా నౌకాదళానికి చెందిన పీ-81 గూఢచర్య విమానాన్నీ రంగంలోకి దింపారు. తమిళనాడు అరక్కోణం తీరంలోని ఐఎన్ఎస్ రజలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం పీ8ఐ టేకాఫ్ అయిందని, సెర్చ్ ఆపరేషన్‌లో ఇదీ పాల్గొంటుందని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ చెప్పారు. పీ8ఐ ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లతో సెర్చ్ చేస్తామని, పీ8ఐలోని పవర్‌ఫుల్ సింథటిక్ అపర్చర్ రాడార్లతో విమానం జాడ కనుగొనవచ్చని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం కారణంగా సెర్చ్ ఆపరేషన్ కు ఆటంకం జరుగుతోందని అధికారులు తెలిపారు. అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ బేస్ నుంచి జూన్ 3, 2019 మధ్యాహ్నం టేకాఫ్ అయిన ఏఎన్ -32 విమానం కాసేపటికే గల్లంతయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు విమానంతో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. విమానంలో13 మంది ఉన్నారు.
