ఆధ్యాత్మికం: మంచి స్నేహం త్యాగానికి మారుపేరు.. దుర్యోధనుడితో కర్ణుడి మైత్రి దారితప్పింది.. అదే కురక్షేత్ర యుద్దానికి కారణం..!

ఆధ్యాత్మికం:  మంచి స్నేహం త్యాగానికి మారుపేరు.. దుర్యోధనుడితో కర్ణుడి మైత్రి దారితప్పింది.. అదే కురక్షేత్ర యుద్దానికి కారణం..!

త్యాగానికి, స్నేహనిరతికి కర్ణుడు మరో పేరు. అంత మంచి స్నేహితుడున్నా దుర్యోధనుడు ఎందుకు దారితప్పాడు? అసలు.. దుర్యోధనుడు దారితప్పడానికి వీరి స్నేహమే ఓ కారణమా? కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం ఎలా దారితప్పిందో తెలిస్తే స్నేహానికి ప్రతిభ ముఖ్యమో? నడవడి ముఖ్యమో తెలుస్తుంది.

కర్ణుని జీవితంలో.. గురువును మోసగించి పొందిన విద్య అవసరానికి ఉపయోగపడలేదు. వ్యాపార పద్ధతిలో తాను ఇంద్రుని వద్ద తీసుకున్న 'శక్తి' అనే ఆయుధం లక్ష్య సాధనలో పనిచేయలేదు. అహంభావం, చెడు సహవాసం వల్ల కర్ణుని జీవితంలో మాయని మచ్చలు ఎక్కువ అయ్యాయి.

 'మిత్రుడు' అనేవాడు తన స్నేహితుని దుర్వర్తనను సరిచేయాలి, కానీ, దానిని సమర్ధించడం వల్ల తాను చెడిపోయాడు, తనను నమ్మిన దుర్యోధనుని పతనానికి కారణమయ్యాడు. కర్ణుడు తనకు సహాయకారియని దుర్యోధనుడు విశ్వసించకుండ ఉండిఉంటే పాండవులతో కలహించేవాడు కాదేమో.

మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వం సద్గుణాలు, దుర్గుణాలు కలగలిపి ఉంటుంది. కర్ణుడి కులం కారణంగా అర్జునుడితో ద్వంద్వయుద్ధానికి ద్రోణుడు అనుమతించడు. అవమానభారంతో ఉన్న అంగరాజ్యం ఇచ్చి, గౌరవించిన దుర్యోధనుడి పట్ల అభిమానం పెంచుకుంటాడు కర్ణుడు. దుర్యోధనుడి సేవకోసం కర్ణుడు హస్తినాపురంలోనే ఉంటాడు. 

భీష్ముడ్ని లేదా ధృతరాష్ట్రుడ్ని సంప్రదించకుండా దుర్యోధనుడు అంగరాజ్యం ఇస్తాడు. కర్ణుడు తీసుకున్నాడు.కర్ణుడు గొప్ప దాత. కృతజ్ఞునిగా కూడా ప్రసిద్ధుడు. కానీ, నీచులను ఆశ్రయించడం వల్ల తన వ్యక్తిత్వాన్ని చెడగొట్టుకున్నాడు. పరశురామునికి అబద్ధం చెప్పి విద్య అభ్యసించి, అతని శాపానికి గురవుతాడు.

సభా పర్వంలో..

ముఖ్యంగా మహాభారత సభాపర్వంలోని 'ద్రౌపదీ వస్త్రాపహరణం' గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. పాండవులు మాయా జూదంలో ఓడిపోతారు. ధర్మరాజు ద్రౌపదిని కూడా ఓడిపోవడం, ఆమెను సభలోనికి దుశ్శాసనుడుఈడ్చుకు రావడం తెలిసిందే. "నేను ధర్మ విజితనా అధర్మ విజితనా" అని ద్రౌపది అడిగిన ప్రశ్నకు ఆ సభలో ఎవరూ సమాధానం చెప్పరు. వికర్ణుడు ఆమె "అధర్మ విజిత” అని అంటాడు. వికర్ణుడి సమాధానానికి స్పందించిన కర్ణుడు .

"నీవు ద్రౌపది నధర్మ విజితయని బలికితి,
సభాసదులెల్ల నెఱుంగ ధర్మజుండు
ధన సర్వస్వము నొడ్డి యోటుపడినప్పుడు '
ఇది' వెలిగాదు. గావున ధర్మవిజితయే"


అంటాడు. అంతటితో ఆగక..

 "మణి యేకవస్త్రయై నున్న దీని సభకుం దోడ్కొని వచ్చుట ధర్ముము కాదంటివి. 
భార్యకు దైవహితుండైన భర్త యొక్కరుండ. యిది అనేక భర్తక గావున 'బంధకి' యనంబడు. నిట్టిదాని వివస్త్రను జేసి తెచ్చినను ధర్మ విరోధంబు లేదు

" అంటాడు కర్ణుడు.

మాట తూలితే వచ్చిన ముప్పు

కర్ణుడు పలికిన ఆ మాట... దుర్యోధనునిలో మరొక ఆలోచనకు బీజం వేసింది. దుర్యోధనుని మెప్పు కోసం ద్రౌపదికి కర్ణుడు వాడిన మాట 'బంధకి'. ఇక రెండవది 'వివస్త్రను చేసి తెచ్చినను ధర్మ విరోధంబుకాదనడం .. ఈ రెండు తప్పులే మహాభారతయుద్ధానికి నాంది.

'బంధకి' అంటే సాధారణ వేశ్య కాకుండా భర్తను కలిగి ఉండీ మరొక గృహస్థును తన వన్నెచిన్నెలతో ఆకర్షించి పతనావస్థకు దిగజార్చేందుకు ప్రయత్నించే స్త్రీ. 'అసమర్థులైన ఐదుగురి భర్తల కన్నా, సమర్థుని ఒక్కని కట్టుకొమ్మ'ని సభలో ద్రౌపదితో కర్ణుడు అనడం... అదే సూచనగా దుర్యోధనుడు తన తొడ చూపుతాడు. దానికి ఆగ్రహించిన భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేస్తాడు.

కర్ణుడి ఓటమి

అర్జునునికి కర్ణుడు సమానమైన విలువిద్యా నైపుణ్యం కలిగిన వాడని దుర్యోధనుడు నమ్మాడు. కానీ, ఎన్నోమార్లు కర్ణుడు ఓడిపోవడం, అర్జునుడు గెలవడం కనిపిస్తుంది. దృపదుని పట్టి తెచ్చేటప్పుడు కౌరవులతో సహా వెళ్ళిన కర్ణుడు పారిపోయి వస్తాడు. ఘోషయాత్రలో గంధర్వుడైన చిత్రాంగదుని
చేతిలో ఓడి, పారిపోతాడు, ఉత్తర గోగ్రహణ అప్పుడు కూడా పారిపోతాడు. 

యుద్ధ నివారణకై రాయబారాలు జరిపినప్పుడు.. కర్ణుడు వాటిని చెడగొట్టేందుకు అవసరమైన అన్ని పనులు చేశాడు. కృష్ణరాయబార సమయంలో ఆయనను బంధించే దుర్మార్గానికి కారణం కర్ణుని మంత్రాంగమే. భీష్ముడు మరణించేంత వరకు తాను యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేస్తాడు. అలాకాక, ఆ పది రోజులు కూడా యుద్ధం చేసి ఉంటే తప్పక పాండవ సైన్యం అధిక మొత్తంలో హననమయ్యేది.

 అభిమన్యుని సంహరించినప్పుడు జరిగిన అధర్మంలో తాను ముఖ్య భూమిక వహించాడు. సైంధవ వథ నాడు అర్జునుని నిలువరించలేకపోయాడు. అర్జునుని సంహరించేందుకు తన కవచకుండలాలు ఇంద్రునికిచ్చి ఇంద్రుని వద్ద 'శక్తి' అనే ఆయుధాన్ని పొందాడు. ఆ ఆయుధాన్నిఘటోత్కచునిపై ప్రయోగించి విఫలమయ్యాడు. 

ఎన్నో మార్లు పాండవుల చేతిలో పరాజయం పొందినా పాండవుల నందరినీ ధర్మరాజుతో సహా తను జయించగలిగినా కుంతికి ఇచ్చిన మాట ప్రకారం వదిలివేసాడు. అది మిత్రద్రోహమే అయింది. శల్యుని స్థాయిని, అంతర్యాన్ని తెలుసుకోలేని అవగాహనా రాహిత్యం వల్ల అతని సారథ్యం కోరి అతని ఎత్తిపొడుపు మాటలకు బాధపడతాడు. చివరకు అర్జునుని చేతిలో మరణించడంతో అతని జీవితం ముగిసింది.