గుట్టల్లో వేట: మావోయిస్టులు డబ్బు దాచారా?

గుట్టల్లో వేట: మావోయిస్టులు డబ్బు దాచారా?

ఆ గుట్టపై అడుగడుగునా గుంతలే. ఏ పుట్టమట్టికోసమో, ఏనె రాళ్ల కోసమో తవ్వినవి కావు. నక్సల్స్‌‌ డబ్బు సంచులు దాచారన్న అనుమానంతో ఐదేళ్ల నుంచి తవ్వగా ఏర్పడినవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని రాఘవాపూర్, వెలిశాల, శాంతినగర్‌‌, అందుకుతండా, గిద్దెముత్తా రం శివారు సరిహద్దు ప్రాంతాల్లో గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు ఈ గుట్టల్లో మావోయిస్టుల సంచారం ఉండేది. చుట్టూ అడవులు పలుచబడడంతో వారి కదలికలు తగ్గిపోయాయి. అయితే రాఘవాపూర్‌‌, వెంకట్రావుపల్లి అడవుల్లో మావోయిస్టులు డబ్బులను డంపుల్లో దాచి పెట్టరని పుకార్లు ఉన్నాయి. ఇప్పటికే కొందరికి ఆ డబ్బులు దొరికాయన్న ప్రచారమూ ఉండడంతో ఐదేళ్లుగా రాఘవాపూర్‌‌ గుట్టల్లో జనం తవ్వుతూనే ఉన్నారు. గొర్రెలు, బర్రెల కాపరులు మేత కోసం మందలను ఈ గుట్టపైకి తోలుకుపోతుంటారు. అక్కడ ఇప్పటికే ఏర్పడిన గుంతలు చూసి, డబ్బు దొరికి ఉంటుందన్న అనుమానాలతో మరికొన్ని చోట్ల తవ్వుతున్నారు. ఇలా అడుగడుగునా గుంతలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయి. కొన్నేళ్ల క్రితం పశువుల కాపరులకు రాఘవాపూర్‌‌ గుట్టల్లో డబ్బుల డంపు దొరికిందని, వాళ్ల మధ్య గొడవలు జరిగాయని ప్రచారంలో ఉంది. ఈ ఘటనపై పోలీసులూ విచారణ జరిపినట్టు చెబుతారు. అప్పటినుంచి ఈ పరిసర గుట్టలపై తవ్వకాలు రెట్ట ింపు అయ్యాయంటున్నారు.

500పైగా గుంతలు
రాఘవాపూర్‌‌ సమీప గుట్టల్లో సుమారు 500 గుంతలు ఏర్పడ్డాయి. పాతికేళ్ల క్రితం జిల్లా సరిహద్దు మండలమైన ఉమ్మడి చిట్యాల ప్రాంతంలో అజ్ఞాత దళాల అలజడి ఉండేది. ఆ సమయంలో అందిన నగదు, బంగారాన్ని డ్రమ్ముల్లో నింపి గుట్టల్లో పాతిపెట్టారని స్థానికుల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఐదేళ్లుగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడీగుంతలు మూగజీవాలకు ప్రమాదకరంగా మారాయి. మేతకు వెళ్లిన పశువులు వీటిల్లో పడి గాయపడుతున్నాయి. ఈ గుంతలు వర్షాకాలం మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.