
మైనారిటీ సంఘాలు, విద్యార్థులు, మానవ హక్కుల నేతల నిరసనలతో హోరెత్తుతోంది బంగ్లాదేశ్. స్క్రాప్ వ్యాపారిని దారుణాతి దారుణంగా చిత్ర హింసలు పెట్టి చంపడంపై ప్రజలు భగ్గుమన్నారు. రోడ్లపైకెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. యూనుస్ ప్రభుత్వ అసమర్థతపై దుమ్మెత్తి పోస్తున్నారు. ‘‘అమాయక చిరు వ్యాపారిని చంపే హక్కు మీకెవరిచ్చారు’’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
స్క్రాప్ వ్యాపారిపై మూక దాడికి సంబంధించిన వీడియో బంగ్లాదేశ్ లో వైరల్ గా మారింది. స్లాప్ కాంక్రీట్ రాళ్లతో అతి కిరాతకంగా దాడి చేయడంతో లాల్ చంద్ సొహాగ్ అనే స్క్రాప్ వ్యాపారి చనిపోయాడు. ఆ తర్వాత శవంపై ఎక్కి చాలా రాక్షసానందంతో డ్యాన్సులు చేశారు దుండగులు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 2025, జూలై 9 (బుధవారం) న సర్ సలీముల్లా మెడికల్ కాలేజ్ మిట్ఫోర్డ్ ఆసుపత్రి ముందు ఎదుట జరిగింది ఈ మూకదాడి హత్య. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావటంతో బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీ సంఘాలు భగ్గుమన్నాయి. హిందూ సంఘాలతో పాటు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు రాజధాని ఢాకాలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
లాల్ దారుణ హత్యకు సంబంధించిన వీడియో వైరల్ అయిన వెంటనే ఢాకా యూనివర్సిటీ, జగన్నాథ్ విద్యార్థులు భారీగా నిరసనలకు దిగారు. BRAC, NSU, ఈస్ట్ వెస్ట్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈడెన్ కాలేజ్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా శనివారం (జులై 12) ఆందోళనలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో 19 మంది నిందితులపై కేసు మర్డర్ కేసు నమోదైంది. వీరితో పాటు మరో 15 నుంచి 20 మందిపైనా కేసులు పెట్టారు పోలీసులు. అయితే స్క్రాప్ డీలర్ హత్య వెనుక బంగ్లా దేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) యూత్ వింగ్ నాయకులు ఉన్నట్లు BDNews24 పేర్కొంది. మూకదాడి ఆరోపణలు ఉన్న ఐదు మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది.
ఆగస్టు 2024 నుండి, బంగ్లాదేశ్‌లో గత ప్రధాని షేక్ హసీనా 16 ఏండ్ల పాలనను కూల్చేసి యూనుస్ ఆధ్వర్యంలో మధ్యంతర ప్రభుత్వ ఏర్పడిన తర్వాత మూక హత్యలు పెరుగుతూ వస్తున్నాయి. జూలై 10న, బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ యూనిటీ కౌన్సిల్ నివేదించిన ప్రకారం, 2024 ఆగస్టు 4 నుంచి 330 రోజులలో మైనారిటీ వర్గాలపై 2,442 మత సంబంధిత హింసాత్మక ఘటనలు జరిగాయి. లేటెస్ట్ గా స్క్రాప్ డీలర్ పై మూకదాడి జరగటం.. చనిపోవడంతో మరోసారి బంగ్లాదేశ్ మైనారిటీలు ఆందోళన బాట పట్టారు.