సర్కార్ సన్నబియ్యంతో బియ్యం రేట్లు తగ్గినయ్ .. అన్ని రకాలపై రూ.500కిపైగా పడిపోయిన రేట్లు

సర్కార్  సన్నబియ్యంతో  బియ్యం రేట్లు తగ్గినయ్ .. అన్ని రకాలపై రూ.500కిపైగా పడిపోయిన రేట్లు
  • సర్కారు 3 నెలల రేషన్ ​ఒకేసారి పంపిణీ చేయడంతో మార్కెట్‌‌లో తగ్గిన డిమాండ్ 
  • ఏ రకమైనా క్వింటాల్​కు రూ.4 వేల నుంచి 4,600 మధ్యే 
  • గతేడాదితో పోలిస్తే రూ.వెయ్యి వరకు తగ్గిన సన్న బియ్యం ధర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు బోనస్ ప్రకటనతో ఈ సారి సన్నవడ్ల సాగుపెరగడం, మూడు నెలల రేషన్ కింద సన్నబియ్యం ఒకేసార పంపిణీ చేయడంతో మార్కెట్​లో సన్న బియ్యం రేట్లు భారీగా తగ్గాయి. అన్ని రకాల బియ్యంపై రూ.500 వరకు తగ్గడంతో ప్రస్తుతం మార్కెట్​లో ఏ రకమైనా క్వింటాల్ బియ్యం రూ.4,000 నుంచి రూ.4,600 మధ్యే దొరుకుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఒక్కో క్వింటాల్​పై రూ.800 నుంచి రూ.1,000 వరకు రేటు తగ్గడం విశేషం. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. 

సర్కారు క్వింటాల్ సన్నవడ్లపై రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో గతంతో పోలిస్తే సన్నాల సాగు రెట్టింపు అయింది. ఫలితంగా సప్లైకి తగ్గ డిమాండ్- లేకపోవడంతో ధరలు పడిపోయాయని వ్యాపారులు చెప్తున్నారు. అలాగే పొరుగు రాష్ట్రాల్లో సన్న బియ్యానికి గిరాకీ లేకపోవడం కూడా మరో కారణమని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.60 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు 17,349 రేషన్ షాపుల ద్వారా గత నెలలో మూడు నెలలకు సంబంధించి 4.73 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. 

మూడు నెలల రేషన్ కోసం 5.75 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేశారు. ఇప్పటివరకు 85 శాతం పంపిణీ పూర్తయింది. భారీ పంపిణీ కారణంగా బహిరంగ మార్కెట్‌‌లో సన్న బియ్యం డిమాండ్ గణనీయంగా తగ్గింది. జూన్ నుంచి క్రమంగా తగ్గుతున్న బియ్యం ధరలు జులై మొదటి వారంలో భారీగా పడిపోయాయి. గత ఏడాది క్వింటాకు రూ.5,600గా ఉన్న హెచ్‌‌ఎంటీ రకం బియ్యం ధర ఇప్పుడు రూ.4,600కు, కర్నూల్ మసూరి రకం రూ.4,000కు తగ్గింది. జై శ్రీరాం రూ.5,800 నుంచి రూ.4,600కు పడిపోయింది. ఆర్‌‌ఎన్‌‌ఆర్, సాంబా రకాల ధరలు కూడా క్వింటాకు రూ.1,000 వరకు తగ్గాయి.  

20% తగ్గిన కొనుగోళ్లు.. వ్యాపారుల ఆందోళన  

తగ్గిన ధరలు మధ్యతరగతి వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌‌లో బియ్యం వ్యాపారులకు గిరాకీ 20 శాతానికి పైగా పడిపోయింది. హైదరాబాద్ వంటి పట్టణాల్లో రోజువారీ కొనుగోళ్లు భారీగా తగ్గాయని, కొన్ని ప్రాంతాల్లో రైస్ షాపులకు బోనీ కూడా లేని పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు. రామంతపూర్‌‌కు చెందిన ఓ హోల్‌‌సేల్ బియ్యం వ్యాపారి మాట్లాడుతూ.. “గతంలో నెలకు 250 క్వింటాళ్ల బియ్యం  అమ్మిన షాపులు ఇప్పుడు 100 క్వింటాళ్లు కూడా అమ్మలేని పరిస్థితి నెలకొంది. కూకట్‌‌పల్లిలో ఇప్పటికే పది రైస్ షాపులు దివాళా తీశాయి. భవిష్యత్తులో బియ్యం షాపులు మూతపడి, మాల్స్‌‌లోనే బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది” అని ఆందోళన వ్యక్తం చేశారు. 

వినియోగదారులకు లబ్ధి 

రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని దాదాపు 30 లక్షల కుటుంబాలు మాత్రమే ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌‌లో బియ్యం కొంటున్నాయి. ఈ కుటుంబాలకు నెలకు 60 వేల టన్నుల బియ్యం అవసరమవుతుంది. అయితే, రేషన్ ద్వారా సన్న బియ్యం 4.73 లక్షల టన్నుల బియ్యం పంపిణీతో మార్కెట్‌‌లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. దీంతో ధరలు క్వింటాకు రూ.500- నుంచి 1,000 వరకు తగ్గాయని, ఇది వినియోగదారులకు లాభదాయకంగా ఉందనికొనుగోలుదారులు అంటున్నారు. 

దిగుబడి రెట్టింపుతో.. డిమాండ్ తగ్గింది

రాష్ట్రంలో సన్న వడ్ల దిగుబడి గతంలో కంటే దాదాపు రెట్టింపు స్థాయికి పెరిగింది. దీనికితోడు తమిళనాడు, మహారాష్ట్ర నుంచి సన్న బియ్యం ఆర్డర్స్ తగ్గిపోయాయి. దీంతో డిమాండ్ లేక సన్న బియ్యం ధరలు గణనీయంగా  తగ్గాయి. ఫలితంగా గత ఆరు నెలల నుంచే బియ్యం ధరలు కిలోకు రూ.6 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్మతున్నాం. 

వల్లాల మురళి, జీజేఆర్ చావల్, బాగ్ అంబర్​పేట్​

సన్న బియ్యం పంపిణీతో కొనుగోళ్లు తగ్గాయి..

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్​షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడంతో బస్తీలు, సాధారణ ప్రజలు జీ వించే ప్రాంతాల్లో బియ్యం కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. గతంలో కంటే నేడు 50 శాతం కొనుగోళ్లు తగ్గాయి. పట్టణాల్లో రైస్ షాపులకు రెంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో మరింత ఇబ్బంది తప్పదు. ప్రభుత్వం అమలు చేస్తున్నది మంచి పథకమే. ఇన్నాళ్లు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం అమ్ముకునే వాళ్లు. ఇప్పుడు సర్కారుసన్న బియ్యం ఇస్తుండటంతో అమ్ముకోకుండా తింటున్నరు. 

 కృష్ణ, బియ్యం వ్యాపారి, రామంతపూర్