పొంచిఉన్న వ్యాధుల ముప్పు!

పొంచిఉన్న వ్యాధుల ముప్పు!
  • గ్రామాల్లో అధ్వానంగా పారిశుద్ధ్యం
  • కలుషిత నీరు, అపరిశుభ్రతతో వ్యాధుల వ్యాప్తి
  • ఏటా సీజనల్ వ్యాధులతో జిల్లా ఉక్కిరిబిక్కిరి
  • వేధిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కొరత
  • వచ్చే నెలలో ఫీవర్​ సర్వే
  •  290 హైరిస్క్ గ్రామాలుగా గుర్తింపు 

ఆదిలాబాద్, వెలుగు: వానాకాలం ప్రారంభమైంది. జిల్లాలో ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం లోపించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ముగిసినా శివారు ఏరియాల  పరిస్థితి మారలేదు. హాస్పిటల్స్ లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏళ్లకేళ్లుగా వైద్యుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు.  

పెరుగుతున్న కేసులు.. వెక్కిరిస్తున్న ఖాళీలు..

గత ఏడాది 16,089 డయేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 6,452 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మలేరియా రెండు, డెంగీ 231 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకే 38 కేసులు రికార్డ్ ​అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 22  పీహెచ్​సీలు, ఏరియా హాస్పిటల్, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు, 126 సబ్ సెంటర్లు ఉండగా,  పీహెచ్​సీల్లో 13 డాక్టర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్బన్​ సెంటర్లలో ఏడు డాక్టర్​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరు ఫార్మసిస్టు, ఐదు ల్యాబ్ టెక్నిషియన్, మిగతా పోస్టులు 94  ఖాళీగా ఉన్నాయి. 

290 హైరిస్క్ ఏరియాలు...

జిల్లాలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వ్యాధులు ముసురుకున్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 290 హైరిస్క్ గ్రామాలను గుర్తించినట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. గతంలో నమోదైన డయేరియా, డెంగీ, మలేరియా కేసులను పరిగణలోకి తీసుకొని హైరిస్క్ ఏరియాలను గుర్తించినట్లు చెబుతున్నారు. వీటిలో ఏజెన్సీలోనే 142 హైరిస్క్ ఏరియాలు ఉన్నాయని వివరించారు. ఇది ఇలాఉంటే ఇప్పటి వరకు  గ్రామాల్లో వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. ఫీవర్ సర్వే నిర్వహించలేదు. దోమ తెరల పంపిణీ, మురికి గుంతల్లో గంబూజియ చేపలు, యాంటీ లార్వా, ఆయిల్ బాల్స్, క్లోరినేషన్ ప్రక్రియ, ఫాగింగ్, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళిక వంటి కార్యక్రమాలు ఇంకా స్టార్ట్​ కాలేదు.