వర్షాకాలంలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. జాగ్రత్తలేంటి..?

వర్షాకాలంలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. జాగ్రత్తలేంటి..?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐదారు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జనం ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైనా పనుల మీద బయటకు వెళ్లే వారు.. ఎక్కడికక్కడ నిలిచిన నీరు, దెబ్బతిన్న రహదారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా సీజనల్ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచి.. అపరిశుభ్ర వాతావరణం, దోమల తీవ్రత ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురికాకుండా, వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ పలు సలహాలు, సూచనలు అందించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

వర్షాకాలంలో ఇప్పటికే సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ చెప్పారు. ఆస్పత్రుల్లో ఔట్ పేషంట్ల సంఖ్య పెరుగుతోందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. 

ముఖ్యంగా దోమల ద్వారా డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. తాగేనీరు, కలుషిత నీటితో కలిసే ఆస్కారం ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని సూచించారు. మనం నివసించే ఇంటి చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. 

కొబ్బరి చిప్పలు, ఖాళీ బొండాలు, కోడి గుడ్డు పెంకులు, మొక్కల తొట్టిలు, వృథాగా ఉన్న టైర్లు, వేసవిలో వాడిన కూలర్లలో నీళ్లు ఉంటే దోమలు తయారై డెంగీ ప్రబలే అవకాశం ఉంది. మురుగు, నిల్వ నీరు మలేరియా, ఫైలేరియా ప్రబలేందుకు దోహదం చేస్తాయి. వానాకాలంలో పరిస్థితి మరింత తీవ్రత చాటే అవకాశం ఉన్న దృష్ట్యా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్ల వద్ద నీటి నిల్వ పాత్రలు, కూలర్లు, డ్రమ్ములు ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.

* వర్షాకాలం వచ్చిందంటే చాలు.. జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. 

* వర్షాకాలంలో సాధ్యమైనంతవరకూ నీటిని కాచి చల్లార్చి తాగితే ఆరోగ్యానికి మంచింది.

* విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.

* ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనెను చేర్చాలి. 

* జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 

* రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు తీసుకోవాలి.