మా బలాన్ని బట్టి సీట్లియ్యాలి.. లేకపోతే విడిగా పోటీచేస్తం : తమ్మినేని

మా బలాన్ని బట్టి సీట్లియ్యాలి.. లేకపోతే విడిగా పోటీచేస్తం : తమ్మినేని

హైదరాబాద్, వెలుగు : ‘‘రానున్న ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తయ్. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే యోచనలో ఉన్నం. మా బలానికి తగినట్లు సీట్లు ఇవ్వాలని అడుగుతాం. ఇవ్వకపోతే విడిగా పోటీ చేస్తం” అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అలాగే కేంద్రంలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్​కు  ఉందని భావిస్తే, ఆ పార్టీతో కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంటామని ఆయన చెప్పారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్​తో రాజకీయంగా స్నేహంగానే ఉంటామని, అదే సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

ఎంబీ భవన్​లో రెండు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి, సీతారాములుతో కలిసి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 50 వేల మంది ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్నారని, మే నెలలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. జూన్ లో అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన చేస్తామని, అప్పటికీ సమస్యలను పరిష్కరించకపోతే జూన్​లో ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు.

అలాగే టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్  జడ్జితో విచారణ చేయించాలనీ, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. విజయ రాఘవన్ మాట్లాడుతూ కార్పొరేట్, మతతత్వ ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఇది చాలా ప్రమాదకరమన్నారు.